
అతని ఆట అద్భుతం... మైదానంలో మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు ఒలంపిక్స్ లో దేశానికి బంగారు పతకాలు అందించి హ్యాట్రిక్ కొట్టాడు. స్వాతంత్ర్యానికి ముందే దేశ కీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాడు. భారతరత్నంగా అందరి చేత నీరాజనాలు అందుకుంటున్నప్పటికీ.. ఆ పురస్కారం మాత్రం అతనికి అందలేదు. ఆయన మరెవరో కాదు హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్. నేడు ఆయన 117వ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ.
16వ ఏట సైన్యంలో
1905 ఆగస్టు 29న ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజపుత్ హిందూ కుటుంబంలో ధ్యాన్చంద్ జన్మించాడు. ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్.. పేరు సామేశ్వర్ దత్ సింగ్. వృతి రీత్యా తండ్రికి బదిలీలు కావడంతో ధ్యాన్చంద్ చదువుకు స్వస్తి చెప్పాడు. ధ్యాన్చంద్ చిన్నప్పుడు కుస్తీ పోటీలంటే తెగ ఇష్టపడే వాడు కానీ... యవ్వనంలోకి వచ్చిన తరువాత హాకీపై ఆసక్తి తగ్గించుకున్నాడు. 16వ ఏట 1922లో భారత సైన్యంలో చేరిన ధ్యాన్చంద్ ... అప్పుడప్పుడు క్యాంప్ లో హాకీ ఆడుతుండేవాడు. అతని ప్రతిభను సుబేదార్ మేజర్ బాలే దివారి గుర్తించి అతని టాలెంట్ కు మరిన్ని మెరుగులు దిద్దారు. సుబేదార్ ను తొలి గురువుగా నిర్ణయించుకుని ఒలంపిక్స్ లో ధ్యాన్చంద్ అదరగొట్టాడు.
ఇండియాకు అద్భుతమైన విజయాలు
తొలిసారి ఒలంపిక్స్ లో పాల్గొన్న ధ్యాన్ చంద్ ఇండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఆమ్ స్టర్ డామ్ ఒలంపిక్స్ సహా మిగిలిన అన్ని ఒలంపిక్స్ లో మ్యాజిక్ గేమ్ ఆడి... దేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. ప్రపంచ హాకీ వేదికపై చెరగని ముద్ర వేశాడు. 1936 బెర్లిన్ లో జరిగిన ఒలంపిక్స్ లో టీమిండియాకు కెప్టెన్ గా ధ్యాన్ చంద్ ఎంపికయ్యాడు. ఆగస్టు 5న హంగేరీతో ఆడిన తొలి మ్యాచ్ లో నే 4-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. లీగ్ లో అమెరికా, జపాన్ సహా అన్ని దేశాలపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మరో వైపు ఆతిథ్య దేశం జర్మనీ కూడా లీగ్ లో సత్తా చాటుతూ ఫైనల్ కు చేరింది. గతంలో జర్మనీ చేతిలో ఓడిపోయిన భారత్ ఒత్తిడితో బరిలోకి దిగింది. తొలి అర్ధ భాగంలో నిధానంగా ఆడిన భారత్... రెండో అర్ధ భాగంలో మాత్రం రెచ్చిపోయింది. ఏకంగా 8 గోల్స్ చేసింది. ప్రత్యర్ధికి ఒకే ఒక్క గోల్ ఇచ్చింది. ఫైనల్ లో ధ్యాన్ చంద్ ఒకే ఒక్క గోల్ చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మూడు ఒలంపిక్స్ లో కలిపి 12 మ్యాచుల్లో 33 గోల్స్ చేసి ధ్యాన్ చంద్ రికార్డు సృష్టించాడు.
చివరి రోజుల్లోనూ హాకీకే సమయాన్ని
ధ్యాన్ చంద్ చివరి రోజుల్లోనూ కుటుంబంతో గడపక ఎక్కువగా హాకీకే సమయాన్ని కేటాయించేవారు. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో చీప్ హాకీ కోచ్ గా వ్యవహారించి ఎంతో మంది ఆణిముత్యాలకు ఓనమాలు నేర్పించారు. ఇండియా హాకీ ప్రతిష్ట పడిపోకుండా ప్రతిక్షణం జట్టు కోసమే పనిచేసేవారు ధ్యాన్ చంద్. 1956 లో 51 సంవత్సరాల వయసులో ధ్యాన్ చంద్ సైన్యం నుంచి మేజర్ హోదాలో పదవి విరమణ చేశారు. అదే సంవత్సరం దేశంలోనే మూడో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ భూషణ్ తో ఆయనను సత్కరించింది. 1979 డిసెంబర్ 3న హాకీ లెజండ్ తుదిశ్వాస విడిచాడు. అనారోగ్యం కారణంతో ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.
ఆటకే తన జీవితం
హాకీ లెజండ్ మైదానం లోపలా బయటా చాలా హుందాగా వ్యవహరించేవారు. ఆటతోనే తన జీవితాన్ని గడిపారు. ధ్యాన్ చంద్ కు ఎన్నో అవార్డు లభించాయి. 1936 ఒలంపిక్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ హాకీ మాంత్రికుడిని అప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఎంతో మెచ్చుకున్నారు. ధ్యాన్ చంద్ మ్యాజిక్ కు ఫిదా అయిపోయిన ఆయన... తమ దేశంలోనే ఉండిపోవాలంటూ కోరారు. జర్మనీ సైన్యంలో కల్నల్ పోస్టుతో పాటు జర్మన్ పౌరసత్వాన్ని ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. అయితే వీటన్నింటిని ధ్యాన్ చంద్ దేశం కోసం తిరస్కరించారు. ఒలంపిక్స్ లో ఇప్పటి వరకు అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది.