ఆడ పిల్లలకు ఆనాడే చదువు చెప్పింది!

ఆడ పిల్లలకు ఆనాడే చదువు చెప్పింది!

నూట డబ్బయ్యేళ్ల క్రితం ఆడపిల్ల బయటకు రావడమే చాలా కష్టం. అప్పటి సొసైటీ అలా ఉండేది. అలాంటి రోజుల్లో సావిత్రిబాయి ఫూలే ఆడపిల్లలకోసం ప్రత్యేక స్కూలు పెట్టింది. మొదట్లో ఎందరో వ్యతిరేకించారు. బురద జల్లారు. తిట్టిపోశారు. అయినా సావిత్రిబాయి జంకలేదు. ‘నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను’ అని చెప్పి, తన లక్ష్యం దిశగా సాగిపోయారు.

మన దేశంలో ఆడపిల్లల చదువు, వాళ్ల అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రిబాయి పూలే పేరు. పశ్చిమ మహారాష్ట్రలోని నయగావ్ అనే గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3న సావిత్రిబాయి పుట్టింది. అప్పటి సంప్రదాయం ప్రకారం తొమ్మిదో ఏటనే  జ్యోతిరావు పూలేతో ఆమెకు పెళ్లయింది. పెళ్లయినప్పటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో భర్తకు అన్ని విధాలుగా సావిత్రి తోడుగా నిలిచారు. మనదేశంలోని మహిళలందరికీ సంపూర్ణ మానవ హక్కులు అందుబాటులోకి రావాలని మహాత్మా జ్యోతిబా పూలే కలలు కన్నారు. అది సాధ్యం కావాలంటే ఆడవాళ్లందరూ చదువుకోవడం తప్ప మరో మార్గం లేదని నమ్మారు. ఈ పరిస్థితుల్లో బాలికల కోసం స్కూల్స్  ప్రారంభించాలని పూలే దంపతులు నిర్ణయించుకున్నారు.

1848లో ఆడపిల్లల స్కూల్ ప్రారంభం

1848లో పూణేలోని ఒక ఇంట్లో ఆడపిల్లలు చదువుకోవడానికి  ఒక స్కూల్ ను పూలే దంపతులు ప్రారంభించారు. తొమ్మిది మంది పిల్లలతో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభమైంది. సావిత్రిబాయి పూలే ఆ స్కూల్ కు హెడ్మాస్టర్ గా ఉన్నారు. కేవలం ఆర్నెల్లపాటు కొనసాగిన స్కూల్ మూతపడింది. కొన్ని నెలల తరువాత మరో బిల్డింగ్ లో స్కూల్ మళ్లీ ఓపెన్ అయింది. అయితే పూలే దంపతులు మొదలెట్టిన ఈ మంచి పనికి అప్పట్లో  చాలా మంది నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా మనువాదాన్ని  సమర్థించే కొన్ని కులాలవాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలకు చదువు చెప్పడానికి సావిత్రిబాయి స్కూల్ కు వెళుతుంటే ప్రతిరోజూ  ఆమెను వేధించే వాళ్లు. గల్లీల్లో  నడిచి వెళుతుంటే  ఛాందసవాదులు ఆమెపై రాళ్లు, మట్టి, బురద విసిరేసేవాళ్లు. మగవాళ్లు ఆమెను తిట్టేవాళ్లు. ఛాందసవాదులు ఎన్ని అవరోధాలు కల్పించినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా సావిత్రి బాయి ఏరోజూ ధైర్యం కోల్పోలేదు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. “ నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు ”అని ఎంతో సహనంతో తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు బదులిచ్చేది. ఈ సమయంలో సావిత్రికి భర్త జ్యోతిబా పూలే అండగా నిలిచారు. ఆమె దిగులు పడ్డప్పుడు ధైర్యం ఇచ్చారు.

సావిత్రిబాయి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ తరంలోని అనేక మంది ఉద్యమ నాయకులు డాక్టర్ ఆనంది బాయి ఘోష్, పండిత రామాబాయి, తారాబాయి షిండే, రమాబాయి రనాడే వంటి వారు సావిత్రి నుంచి స్ఫూర్తిని  పొందారు. ఆడపిల్లలపై  సావిత్రి బాయి ప్రభావం బలంగా ఉండేది. ఆమె దగ్గర చదువుకున్న ముక్త బాయి అనే పదకొండేళ్ల దళిత బాలిక అప్పటి సమాజంలో  మనువాదులు చేసే పెత్తనాన్ని , అవమానాలను విమర్శిస్తూ ఓ అద్భుతమైన వ్యాసం రాసింది. ఈ వ్యాసం  ‘ ద్యానోదయ ’ అనే పత్రికలో వచ్చింది.

సూటిగా, సరళంగా కవిత్వం

1854లో సావిత్రి బాయి  తన కవితా సంపుటి  ‘కావ్య పూలే ’  ను  తీసుకువచ్చారు. ఆనాటి సామాజిక పరిస్థితులకు ఆమె కవిత్వం అద్దం పట్టింది. ఆమె కవితలు చాలా సూటిగా, సరళంగా ఉంటాయి. కుల వ్యవస్థ, బడుగులపై అణచివేత ….ఇటువంటి అంశాలపైనే ఆమె ఎక్కువగా రచనలు చేశారు. తన రచనలతో ఆధునిక మరాఠా కవిత్వానికి ఆమె వైతాళికురాలిగా నిలిచారు. 1891లో  ‘పావనాశి సుబోధ్ రత్నాకర్ ’ అనే కవితా సంపుటి వచ్చింది. ఇది పూలే జీవితాన్ని వర్ణించిన పద్యకావ్యం. సావిత్రిబాయి  ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలోకి వచ్చాయి. సావిత్రిబాయిని చాలామంది జ్యోతిరావు ఫూలే భార్యగానే గుర్తిస్తారు. కాని, ఆమె కంటూ సొంత వ్యక్తిత్వం ఉంది.

(ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా )

‑ జంపాల రాజేష్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్

Remembering social reformer and educationalist savitri bai phule