- పీఎం జుగా పథకంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పన
- ప్రతిపాదనలు రూపొందించిన ఎన్పీడీసీఎల్
నిర్మల్, వెలుగు: మారుమూల గిరిజన పల్లెలకు మహర్దశ పట్టనుంది. గ్రామాలకు తాగునీరు, పారిశుద్ధ్యం, కరెంట్ సౌకర్యంతో పాటు విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి పథకాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జుగా( ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్) పథకం అమలు చేయనుంది. దీనిలో భాగంగా నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన పల్లెలకు కనీస వసతులు లభించనున్నాయి. ముఖ్యంగా పలు గ్రామాలకు దశాబ్దాలుగా ఉన్న కరెంట్కష్టాలు తీరనున్నాయి. అటవీశాఖ నిబంధనల సడలింపు!
జిల్లాలోని పెంబి, కడెం మండలాల్లోని 16
గ్రామాలకు ఇప్పటివరకు కరెంటు సౌకర్యం లేదు. ఈ గ్రామాలన్నీ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉన్నందున విద్యుత్ సరఫరా కోసం అవసరమయ్యే స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వడంలేదు. వీటిలో కొన్ని గ్రామాలకు కేవలం సింగిల్ ఫేస్‌తో కరెంట్ సరఫరా చేస్తుండగా.. పెంబి మండలంలోని సోముగుడా, చాకిరేవు, పెద్ద రాగిదుబ్బ గ్రామాలు ఏండ్ల కాలంగా చీకట్లోనే మగ్గుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పీఎం జుగా పథకంతో అటవీ పర్యావరణ శాఖ నిబంధనలు సడలించే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే ఇతర శాఖల కన్నా ముందుగా విద్యుత్ శాఖ అధికారులు మారుమూల గిరిజన పల్లెల్లో కరెంట్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. గిరిజన పల్లెలతోపాటు మరికొన్ని వెనకబడ్డ గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేలా ఎన్పీడీసీఎల్ అధికారులు ఎంపిక చేశారు.
43 గ్రామాల కోసం ప్రతిపాదనలు
పెంబి మండలంలోని కరెంట్ సౌకర్యం లేని మూడు గ్రామాలతోపాటు మరో 40 మారుమూల గిరిజన గ్రామాలను ఇక్కడి ఎన్పీడీసీఎల్ అధికారులు పీఎం జుగా పథకం కోసం ఎంపిక చేసి ఆ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో పెంబి మండలంలోని గుమ్మన యంగ్లాపూర్, ఇటిక్యాల్, మందపల్లి, పసుపుల, పెంబి, శెట్ పల్లి, దొందరి, కొసగుట్ట, వాసుపల్లి, వెంకం పోచంపాడు, కడెం మండలంలోని మిద్దె చింత, గంగాపూర్ గ్రామాలతో పాటు దిలావర్పూర్ మండలంలోని మాడెగామ్, మామడ మండలంలోని రాసిమెట్ల, కిషన్ రావుపేట్, రాయదారి, తాండ్ర, నిర్మల్ రూరల్ మండలంలోని రాణాపూర్, సారంగాపూర్ మండలంలోని కుప్టి, నాగపూర్ గ్రామాలు ఉన్నాయి.
నర్సాపూర్ మండలంలోని బూరుగుపల్లి, కుభీర్ మండలంలోని డోడర్నా, శివుని, బ్రహ్మేశ్వర్, రంజని, మర్లగొండ, సిర్పల్లి, తానూర్ మండలం లోని మసల్గా, కోలూరు తండా, జరి తండా, లోకేశ్వరం మండలంలోని నర్సింహా నగర్ తండా, సేవాలాల్ తండా, ముథోల్ మండలంలోని విట్టొలి తండా, ఎడ్ బిడ్ తండా, కుంటాల మండలంలోని అంబకంటి తండా, దౌనెల్లి, బూరుగుపల్లి తండా గ్రామాలకు పూర్తిస్థాయిలో కరెంటు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.
పెద్ద రాగిదుబ్బలో సోలార్ ప్లాంట్ కు ప్రతిపాదనలు
పెంబి మండలంలోని అత్యంత మారుమూల గిరిజన గ్రామమైన రాగి దుబ్బలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో మొత్తం సోలార్ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ గ్రామానికి సాధారణ కరెంటు సరఫరా చేయడం కష్టతరం కానునండడంతో ప్రత్యామ్నాయంగా అధికారులు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
అనుమతులు కాగానే పనులు మొదలు పెడతాం
పీఎం జుగా పథకం కింద గిరిజన గ్రామాలకు అదనపు కరెంటు సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. జిల్లాలో 43 గిరిజన గ్రామాలను ఈ పథకం కోసం ఎంపిక చేశాం. ఇప్పటివరకు అసలే కరెంటు లేని గ్రామాలకే కాకుండా సింగిల్ ఫేజ్ ఉన్న గ్రామాలకు త్రీ ఫేస్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేశాం. అనుమతులు, నిధులు మంజూరు కాగానే పనులు మొదలుపెడతాం. - నాగరాజు, డీఈ, ఎన్పీడీసీఎల్, నిర్మల్