గ్రేటర్ లో 87 వేల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు

గ్రేటర్ లో 87 వేల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి చేతినిండా పని పడింది. రాజకీయ పార్టీల అభ్యర్థులు.. వారి తాలూకు కార్యకర్తలు ఎడాపెడా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న పోస్టర్లు.. బ్యానర్లు.. ఫ్లెక్సీలను తొలగించడమే పనిగా మారింది. అనుమతి లేనివాటిని.. ప్రభుత్వ జాగాల్లో ఏర్పాటు చేస్తున్న పోస్టర్లను.. రోడ్లపై పంచిన వాటిని జనాలు పడేస్తుంటే.. వాటిని ఎప్పటికప్పుడు ఏరివేస్తున్నారు.

ఇప్పటి వరకు మొత్తం  87 వేల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో వచ్చినప్పటి నుండి ఇవాళ్టి వరకు మొత్తం 12,500 బ్యానర్లు, 16,040 పోస్టర్లు, 4,231 బోర్డులు, 16,977 ఫ్లెక్సీలు, 37,650 జెండాలను తొల‌గించిన‌ట్టు జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారి విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 485 బ్యానర్లు, 2844 పోస్టర్లు, 71 బోర్డులు, 1300 ఫ్లెక్సీలు, 3,983 జెండాలను తొలగించినట్టు ఆయన తెలిపారు.

హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్లెక్సీలు, బ్యానర్లలో ఎక్కువ భాగం ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, భ‌వ‌నాలు,  ప్ర‌హ‌రీగోడ‌లు,  ప్రధాన రహదారుల వెంట గుర్తించి తొలగించినట్లు వివరించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశామ‌ని విశ్వజిత్ వివ‌రించారు.

Read more News…

డొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం

కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?