ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత!

  • ప్రాసెస్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం  
  • పెండింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్న సీఐడీ

హైదరాబాద్‌‌/కరీంనగర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి కేసులు, జైలుపాలైన ఉద్యమకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయడంతోపాటు అర్హులైన వారికి 250 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు, హెల్త్‌‌కార్డులు సహా ఇతర సౌలతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

ఇందులో భాగంగా 2009 డిసెంబర్‌‌‌‌ 9 నుంచి 2014 జూన్‌‌ 2వ తేదీ వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నది. సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆదేశాలతో సీఐడీ చీఫ్ మహేశ్​ భగవత్‌‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్స్‌‌కి చెందిన  ఎస్‌‌పీలు, సీపీలకు ఫ్యాక్స్‌‌ ద్వారా సమాచారం అందించారు. ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను తెలిపేందుకు ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గతంలో ఎత్తివేసిన కేసులు సహా పోలీస్‌‌ స్టేషన్‌‌, ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నంబర్, సెక్షన్స్, పూర్తి చిరునామా, అరెస్ట్, రిమాండ్‌‌ తేదీలు, 41 సీఆర్‌‌‌‌పీసీ నోటీసులు, కేసు పెండింగ్‌‌లో ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కోర్టు విచారణ వివరాలను సేకరిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు ఈ కేసుల వివరాలను బయటికి తీస్తున్నారు.  
 
సీఐడీ రిపోర్ట్ ఆధారంగా అర్హుల ఎంపిక  

సీఐడీలో ఐటీ సెల్‌‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులపై కేసుల డేటాను కలెక్ట్ చేస్తున్నారు. సీఐడీ సేకరించిన డేటా ఆధారంగా పెండింగ్ కేసులను గుర్తించనున్నారు. గతంలో ఎత్తివేసిన కేసులతో పాటు కోర్టు విచారణలో ఉన్న కేసులను సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. కేసులను ఎత్తివేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు ఎన్నిలకల ప్రచారంలో ప్రకటించినట్లుగా స్కీమ్‌‌లకు అర్హులైన ఉద్యమకారులను ఎంపిక చేయనున్నారు.

ఈ ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన పోలీస్ కేసులు 3,000కుపైగా ఉండగా, జైలుకు వెళ్లినవారు 1,000 మంది వరకు ఉండొచ్చని చెప్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ సర్కార్ పాలనలో ఏనాడూ కేసులు, జైలుపాలైన తెలంగాణ ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసే పనికి పూనుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ హర్షం వ్యక్తం చేశారు.