కామారెడ్డి , కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి టౌన్ లో ఓ హోటల్ షెడ్డు తొలగింపు రగడ కు దారి తీసింది. అకస్మాత్తుగా వెళ్లి ఒకటే షెడ్డు కూల్చటం ఏమిటని మున్సిపల్ఆఫీసర్లపై స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం హౌజింగ్ బోర్డు కాలనీ సమీపంలో వసుధ హోటల్ షెడ్డును మున్సిపల్ యంత్రాంగం వెళ్లి కూల్చివేసింది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి విషయం తెలుసుకుని మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు. పొలిటికల్ లీడర్ల బిల్డింగ్‌లకు కూడా మినహాయింపులు ఇవ్వవద్దని ఎమ్మెల్యే కమిషనర్‌తో అన్నారు.
దీనికి ఆఫీసర్లు మౌనం వహించటంతో ఆయన సీరియస్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. కూల్చివేత విషయంపై మీరేమైనా మున్సిపల్ఆఫీసర్లకు చెప్పరా.. అని ఎమ్మెల్యే షబ్బీర్‌అలీని ఫోన్ లో అడిగారు. కూల్చివేతలపై ఎవరికి ఏమీ చెప్పలేదని షబ్బీర్ అలీ తెలిపారు. ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసు వద్ద ఆందోళన చేస్తున్న టైంలో చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియతో పాటు మరికొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. వారు ఆఫీసులోకి వెళ్తూ ఎమ్మెల్యేను లోపలకు రమ్మన్నారు. లోపల మాట్లాడటం కాదు ఇక్కడే అందరి ముందు మాట్లాడాలని ఎమ్మెల్యే చెప్పారు.
దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు, లీడర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను పక్కకు తప్పించారు. టౌన్ లో ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ ఆఫీసర్లకు ఎమ్మెల్యేనే స్వయంగా లెటర్ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. తీరా ఆఫీసర్లు ఆక్రమణల తొలగింపు షురూ చేస్తే ఎమ్మెల్యేనే వచ్చి అడ్డు చెప్పటం ఏమిటన్నారు. సంబంధిత హోటల్యాజమాన్యంకు నోటీసు ఇచ్చి షెడ్డు కూల్చివేశారన్నారు.