ఎల్ఎండీ ఏరియాలో ఆక్రమణల తొలగింపు

ఎల్ఎండీ ఏరియాలో ఆక్రమణల తొలగింపు
  • ఆఫీసర్లను అడ్డుకున్న కబ్జాదారులు 
  • కేసులు నమోదు చేస్తామన్న అధికారులు
  • స్వచ్ఛందంగా తొలగిస్తామని హామీ పత్రాలు ఇచ్చిన ఆక్రమణదారులు

తిమ్మాపూర్, వెలుగు: ఎల్ఎండీ    నిర్మాణ క్రమంలో  ప్రాజెక్టు వద్ద పనిచేసే ఉద్యోగులకు అవసరమైన ఎమినిటీస్ కల్పించేందుకు సర్వే నంబర్ 481లో కేటాయించిన ఎల్ఎండీ  స్థలంలో కొన్ని ఏండ్లుగా పలువురు నివసిస్తున్నారు. కాగా వీరిలో కొంతమంది ఆ జాగాలు ఇతరులకు అమ్ముకున్నారు. దీంతో ఆ జాగాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని గతంలో ఎల్ఎండీ  అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించారు.

కొన్ని ఏండ్లుగా కోర్టులో కేసు నడుస్తున్నది. ఇటీవల మార్కెట్ ఏరియాలో జాగాలు కబ్జా చేసి కొంతమంది నిర్మాణాలు చేపట్టడంతో ఎస్సారెస్పీ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులను ధిక్కరించి నిర్మాణాలు చేయడంతో గురువారం డీఈ శ్రీనివాస్, ఏఈ కిరణ్ కుమార్, కాళిదాస్, వర్కింగ్ ఇన్​స్పెక్టర్ లక్ష్మణ్​ జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఆక్రమణదారులు, స్థానికులు కొందరు వచ్చి అధికారులను, కూల్చివేతలను అడ్డుకోవడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తాము కూల్చేస్తున్నామని తమను అడ్డుకుంటే అక్రమంగా నిర్మాణం చేపట్టిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో తమ అక్రమ నిర్మాణాలను తామే తొలగిస్తామని కొందరు హామీ పత్రం రాసి ఇవ్వడంతో అధికారులు కూల్చివేతలు ఆపేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం మాట్లాడుతూ కొంత కాలంగా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వారికి నోటీసులను అందజేశామని కోర్టులో కేసు ఉండగా నిర్మాణం చేపట్టడం, నోటీసులు ధిక్కరించడం వల్లనే తాము కూల్చివేశామని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి ఉండాలని అన్నారు.