- గుడికుంట చెరువులో సర్కారు హద్దురాళ్ల తొలగింపు
- కబ్జాకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్ లీడర్
- పట్టించుకోని ఐబీ, రెవెన్యూ ఆఫీసర్లు
- రూ.3 కోట్ల విలువచేసే సర్కారు భూమికి ఎసరు
జయశంకర్ భూపాలపల్లి, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : చెరువు శిఖం భూమి కబ్జా చెరలో చిక్కింది. మూడు కోట్ల సర్కారు భూమికి ఓ బీఆర్‌ఎస్ లీడర్ ఎసరు పెట్టాడు. రాత్రికి రాత్రే మట్టిని పోసి చదును చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహార్‌నగర్ గుడికుంట చెరువును కబ్జాకోరుల నుంచి కాపాడాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. గుడికుంట చెరువు సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఈ చెరువు కింద 250 ఎకరాల పంట సాగవుతోంది. 163 నేషనల్ హైవే పక్కనే ఉండటంతో హైదరాబాద్‌కు చెందిన ఓ బీఆర్‌ఎస్ లీడర్ కన్ను ఈ చెరువుపై పడింది.
2023 జనవరిలో చెరువు శిఖంలో అక్రమంగా మట్టి పోసి కబ్జా చేయడానికి యత్నించారు. రాత్రికి రాత్రే బోరుబావి తవ్వుతుండగా, ఆయకట్టు రైతులందరూ అదేరోజు రాత్రి పనులను అడ్డుకున్నారు. జిల్లా రెవెన్యూ, ఐబీ ఆఫీసర్లకు రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఏప్రిల్ 4, 2023న ఆఫీసర్లు గుడికుంట చెరువు దగ్గర ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. ఐబీ ఈఈ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సర్వే చేసి బీఆర్‌ఎస్ లీడర్ కబ్జా చేయడానికి, బోరు బావి తవ్వడానికి ప్రయత్నించిన ల్యాండ్ అంతా చెరువు శిఖంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. చెరువు శిఖం చుట్టూరా హద్దురాళ్లను పాతారు. అక్రమంగా చేపట్టిన పనులు నిలిపివేయాలని ఆదేశించారు.
మళ్లీ కబ్జాకు ప్రయత్నం..
ఆఫీసర్ల ఆదేశాలతో ఏడాది పాటు నిశ్శబ్ధంగా ఉన్న బీఆర్‌ఎస్ లీడర్ ఇప్పుడు మళ్లీ చెరువు శిఖం భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. జవహార్ నగర్ కు చెందిన ఓ వ్యక్తిని సూపర్‌వైజర్‌గా నియమించుకొని, శిఖం భూమిలో మట్టి నింపుతూ పనులు చేస్తున్నారు. గతంలో ఆఫీసర్లు ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించారు. ఇదేంటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయకట్టు రైతులు మళ్లీ ఐబీ, రెవెన్యూ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆఫీసర్ల పరస్పర ఆరోపణలు..
గుడికుంట చెరువు శిఖం భూమి కబ్జాకు గురవువుతుందని ఇరిగేషన్ ఇంజినీర్లు, వెంకటాపూర్ తహసీల్దార్ వివరణ కోరగా.., ఐబీడీఈ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ నుంచి పట్టాదారు పాస్ బుక్ జారీ చేయడం వల్ల ఇదంతా జరుగుతుందన్నారు. త్వరలోనే ఈఈతో కలిసి సర్వేకు వస్తానన్నారు. వెంకటాపూర్ తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ గత్తంలో కలెక్టర్ ఆదేశానుసారం ఐబీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి చెరువు శిఖంలో హద్దురాళ్లను ఏర్పాటు చేసినప్పుడు ఆ చెరువును కాపాడుకునే బాధ్యత ఇరిగేషన్ శాఖపైనే ఉంటుందన్నారు. త్వరలోనే మా సర్వే టీమ్‌లను క్షేత్రస్థాయికి పంపించి తిరిగి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.
తహసీల్దార్‌కు కంప్లైంట్ చేసినం..
ఈ చెరువు నీటితోనే మా చేలల్లో పంటలు పండుతున్నాయి. చాలా మంది రైతుల బోరుబావుల్లో నీటి నిల్వలు ఉంటున్నాయి. చెరువును కబ్జా చేస్తే ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా చెరువులను కాపాడే ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యనే మళ్లీ వెంకటాపూర్ తహసీల్దార్‌కు కంప్లైంట్ ఇచ్చినం.
- అడ్డగట్ల గోవర్ధన్, గుడికుంట చెరువు ఆయకట్టు రైతు, జవహార్‌నగర్
హద్దురాళ్లను తొలగిస్తే కేసులు ఉండవా?
ఈ చెరువు కింద నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ నీళ్లతో రెండు పంటలు పండిస్తా. చెరువు శిఖాన్ని ఆక్రమిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే సర్కారోళ్లు వచ్చి హద్దురాళ్లు ఏర్పాటు చేసిండ్లు. ఇప్పుడు అవే హద్దురాళ్లను తొలగించి మళ్లీ శిఖం భూమిలో మట్టిపోసి చదును చేస్తుండ్లు. సర్కారోళ్లు చెరువు శిఖాన్ని కబ్జా చేసేటోళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరా? హద్దురాళ్లను తొలగిస్తే కేసులు ఉండగవా?
- జంగ మహేందర్, ఆయకట్టు రైతు, జవహార్‌నగర్