చిలుకానగర్‌‌‌‌లో ఫుట్‌‌పాత్‌‌లపై అక్రమ నిర్మాణాల తొలగింపు.. పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపిన మహిళ

చిలుకానగర్‌‌‌‌లో ఫుట్‌‌పాత్‌‌లపై అక్రమ నిర్మాణాల తొలగింపు.. పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపిన మహిళ

ఉప్పల్, వెలుగు:  ఉప్పల్ జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో ఫుట్‌‌పాత్ లపై అక్రమ నిర్మాణాల తొలగింపును అధికారులు చేపట్టారు. ఈ నిర్మాణాలు తొలగించే క్రమంలో బత్తిని రాధిక అనే మహిళ తీవ్ర నిరసన తెలిపింది.  తాను 20 ఏళ్లుగా పాలకేంద్రం నడిపిస్తున్నానని అన్యాయంగా దాన్ని కూల్చేశారని వాపోయింది.  18 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కడుతున్నానని షాపునకు ట్రేడ్ లైసెన్స్ కూడా ఉందని పేర్కొంది. 

తన భర్త చనిపోయాడని, ఇద్దరు పిల్లల్ని పాల కేంద్రం మీదనే ఆధారపడి పోషించుకుంటున్నానని సడెన్ గా దాన్ని కూల్చివేయడంతో తన జీవితాన్ని రోడ్డు పాలు చేశారని కన్నీటి పర్యంతమైంది. పాల షాపులో ఉన్న ప్రిడ్జ్‌‌లు, పాల ట్రేలు, ఇతర సామానులను జీహెచ్‌‌ఎంసీ వెహికల్ తీసుకెళుతుండగా.. పెట్రోల్ బాటిల్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని జేసీబీ, జీహెచ్‌‌ఎంసీ వాహనాలను అడ్డుకుంది.   తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.