- ‘వెలుగు’ కథనంపై రెవెన్యూ అధికారుల చర్యలు
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం ఏజెన్సీ గ్రామ శివారులో అక్రమంగా వేసిన ఐదెకరాల వెంచర్ ను రెవెన్యూ ఆఫీసర్లు మంగళవారం తొలగించారు. ‘ఏజెన్సీలో బాజాప్తా వెంచర్’ పేరిట మంగళవారం ‘వెలుగు’ దిన పత్రికలో వచ్చిన కథనంపై కాగజ్ నగర్ తహసీల్దార్ కిరణ్ కుమార్ స్పందించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాలీక్, మండల సర్వేయర్ శ్రీనివాస్ , సిబ్బందితో కలిసి ఈస్గాం శివ మల్లన్న ఆలయం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో మెయిన్ రోడ్ పక్కన వేసిన అక్రమ వెంచర్ వద్దకు చేరుకున్నారు.
సదరు పట్టాదారును పిలిపించి వివరాలు అడిగారు. అనుమతుల్లేకుండా వెంచర్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వెంచర్ ను దగ్గరుండి తీయించారు. సిబ్బంది , కూలీలతో ప్లాట్ల కోసం వేసిన హద్దు రాళ్లను తీసేయించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.