- ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
- హోర్డింగ్స్, ఫ్రేమ్స్ తొలగించాలని ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఆదేశం
- ప్రమాదాలకు ఆస్కారం లేకుండా త్వరలో కొత్త పాలసీ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని హోర్డింగ్స్ ను తొలగిస్తున్నారు. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పడంతో గ్రేటర్‌వ్యాప్తంగా తొలగింపు కొనసాగుతోంది. ఏజెన్సీలు స్పందించని ప్రాంతాల్లోని హోర్డింగ్స్ ను బల్దియానే తీసివేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 2,700 హోర్డింగ్స్ ఉండగా, ఇప్పటికే 2వేలకు పైగా తొలగించారు. మిగిలిన చోట్ల ప్రక్రియ కొనసాగుతోంది. సిటీలోని హోర్డింగ్స్ ను రద్దు చేస్తూ 2020లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఏజెన్సీలు వ్యతిరేకించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్డును ఆశ్రయించాయి. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. దీంతో సిటీలోని రోడ్ల వెంట, బిల్డింగ్స్ పై హోర్డింగ్స్, వాటి ఫ్రేమ్స్ అలాగే ఉండిపోయాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించబోమని కోర్టు తీర్పు చెప్పడంతో హోర్డింగ్స్ ను తొలగించాలని జీహెచ్ఎంసీ ఏజెన్సీలను ఆదేశించింది.
ప్రభుత్వ అనుమతి వచ్చాకే కొత్తవి
కొత్త హోర్డింగ్ పాలసీ కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కొత్త పాలసీ అమలులోకి రానుంది. ఇందులో హోర్డింగ్స్ఎత్తు 80 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేసుకునేందుకు వీలుండనున్నట్లు తెలిసింది. 100 ఫీట్ల రోడ్లపైన మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఒక హోర్డింగ్ కి మరో హోర్డింగ్ కి 250 మీటర్ల గ్యాప్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది. ఈసారి ఎల్ఈడీ స్క్రీన్లకు కూడా అనుమతులు లభించనున్నాయి. కొత్త పాలసీ ప్రకారం నార్మల్ హోర్డింగ్ అయితే 4,500 స్క్వైర్ ఫీట్ లో ఉండనుంది. ఎల్ఈడీకి అయితే రివైజ్ చేసి రేటు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. బిల్డింగ్, రూఫ్‌టాప్, రోడ్డుపై ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటున్నప్పటికీ అందుకు సంబంధించి అన్ని క్లియరెన్స్ తీసుకున్నాకే అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ప్రమాదాలకు చెక్
గతంలో ఈదురు గాలులు వీచిన టైంలో సిటీలో ఎక్కడో ఒకచోట హోర్డింగ్స్ విరిగిపడేవి. నాలుగేండ్లుగా కోర్టులో కేసు నడుస్తుండడంతో, హోర్డింగ్స్ ను ఉపయోగించలేదు. మెయింటెనెన్స్ కూడా చేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న తొలగింపులతో ప్రమాదాలకు చెక్‌పెట్టినట్లయింది. కొత్తపాలసీలో ఆంక్షలు విధించాలని జనం కోరుతున్నారు. మరోవైపు కొత్త పాలసీతో హోర్డింగ్స్ నుంచి జీహెచ్ఎంసీకి దాదాపు రూ.100 కోట్ల ఆదాయం రానుంది. 2020 లో హోర్డింగ్స్ బ్యాన్ చేసే ముందు ఏటా రూ.36 కోట్ల ఆదాయం వచ్చేది. బ్యాన్ చేసిన తరువాత బస్ షెల్టర్లు, ట్రాఫిక్ అంబ్రెల్లా తదితర అడ్వటైజ్ మెంట్ ల నుంచి జీహెచ్ఎంసీకి రూ.18 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త పాలసీ ద్వారా బల్దియా ఆదాయం పెరగనుంది.