- పనుల్లో జాప్యం జరిగితే సహించం
- అధికారులను ఆదేశించిన మంత్రి గంగుల
కరీంనగర్ టౌన్,వెలుగు: స్థానిక టవర్ సర్కిల్ లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించి అతని స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం టవర్ సర్కిల్ లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల జాప్యంపై కాట్రాక్టర్కు క్లాస్ తీసుకున్నారు. కొత్త కాంట్రాక్టర్ తో పనులు వేగంగా పూర్తి చేసుకుందామన్నారు. ఫుట్ పాత్ లను ఆక్రమించొద్దని వ్యాపారులకు సూచించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సమావేశం నిర్వహించారు. రోజురోజుకు కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, మున్సిపల్ గా ఉన్పుడు 2.5 లక్షల మంది నివసించేవారని, ఇప్పుడు 4 లక్షల మంది నగరంలో ఉంటున్నారన్నారు. చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేయొద్దని, వారికి ప్రత్యామ్నాయంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 31 వరకు కేబుల్ బ్రిడ్జిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ కర్ణన్, అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్, సీపీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్లాస్వరూపరాణి పాల్గొన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు భూమిపూజ
కరీంనగర్ శివారు, కొత్తపల్లి మండల పరిధి మల్కాపూర్ గ్రామ శివారులో వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు మినిస్టర్గంగుల కమలాకర్ సోమవారం భూమిపూజ చేశారు. వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎమ్మార్వొ శ్రీనివాస్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
‘బండి’ ఆరోపణల్లో తప్పు లేదు
రామడుగు, వెలుగు: సీఎం కేసీఆర్ తన పీఠాన్ని కాపాడుకునేందుకు తాంత్రిక పూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం రామడుగులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ చేసిన వ్యాఖ్యాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. జ్యోతిష్య, వాస్తు, తాంత్రికల సలహా మేరకే సీఎం నడుచుకుంటారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు.8 ఏళ్లుగా సెక్రటేరియట్‌కు వెళ్లని కేసీఆర్తాంత్రికుల సలహా మేరకే పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మిస్తున్నారని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, జిల్లా కార్యదర్శి సత్యం, కోశాధికారి రామానుజం తదితరులు పాల్గొన్నారు.
గంగాధర రైల్వే గేట్‌కు మరమ్మతులు
వారం పాటు రాకపోకలు బంద్
గంగాధర, వెలుగు: కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర రైల్వే గేట్ 29/టీ నుంచి మంగళవారం నుంచి వారం రోజులు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జగిత్యాల కలెక్టర్ జి.రవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేట్ 29/టీ వద్ద ట్రాక్ రిపేర్ వర్క్ చేయడానికి నేటి నుంచి 18వ తేదీ వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే వాహనాలు మధురానగర్ నుంచి తడగొండ, బోయినపల్లి, వేములవాడ నుంచి కొండగట్టు బైపాస్, శాత్రాజ్పల్లి, ఫాజుల్‌నగర్, వట్టెంల, నల్గొండ, చెప్యాల్, దొంగలమర్రి మీదుగా..జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్లే వెహికల్స్దొంగలమర్రి, చెప్యాల్, నల్గొండ, వట్టెంల, ఫాజుల్‌నగర్, శాత్రాజుపల్లి, కొండగట్టు బైపాస్, వేమలవాడ వాడ మీదుగా మధురానగర్‌కు వాహనాలను మళ్లించాలని సూచించారు.
మోడీ, అమిత్‌షా అవినీతిపరులు
- రూ.12 లక్షల కోట్లు అనుచరులకు కట్టబెట్టారు
పెద్దపల్లి, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను మించిన అవినీతిపరులు ఎక్కడా లేరని, వారి అనుచరుల కోసం రూ.12 లక్షల కోట్ల అప్పులు బ్యాంకుల ద్వారా మాఫీ చేశారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి నుంచి కునారం రోడ్డులో రైల్వే బ్రిడ్డితోపాటు పట్టణంలోని ఫోర్వేకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. సింగరేణి బొగ్గు తక్కువ ధరకు దొరుకుతున్నా, ప్రధాని తన అనుచరుల కోసం ఆస్ట్రేలియా నుంచి అధిక ధరకు బొగ్గును కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మంత్రి ఈశ్వర్, జడ్పీ చైర్మన్పుట్ట మధు, ఎంపీ వెంకటేశ్, కలెక్టర్సంగీత
తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యవర్గం ఎన్నిక
రాజన్న సిరిసిల్ల, వెలుగు : స్థానిక విశ్రాంత భవనంలో సోమవారం రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం. బలరాం, గౌరవ అధ్యక్షుడిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ప్రధాన కార్యదర్శి గా సుధాకర్, కోశాధికారిగా దేవదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా రామస్వామి, కార్యదర్శులు బాలనాగచారి, శ్యాం, భూమయ్య, హరికృష్ణ, దేవరాజు, దత్తాత్రేయ గౌడ్, రామచంద్రం, ఝాన్సీలక్ష్మి, రాష్ట్ర కౌన్సిలర్ గా డాక్టర్ చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కోల్‌మైన్స్ పింఛన్ పెంచాలని ధర్నా
గోదావరిఖని, వెలుగు : సింగరేణితో పాటు దేశంలో కోల్ ఇండియా పరిధిలో 1998 నుంచి రిటైర్డ్ అయిన బొగ్గు గని కార్మికులకు పింఛన్‌ను పెంచాలని విశ్రాంత కార్మికులు సోమవారం గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం సంబంధిత ఆఫీసర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన కోల్‌మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.బాబూరావు మాట్లాడుతూ 1998లో తీసుకువచ్చిన పింఛన్ పథకం లోపభూయిష్టంగా ఉందన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 11 రాష్ట్రాలకు చెందిన కోల్‌మైన్స్ పెన్షనర్లతో ధర్నా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి, పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ జనరల్ సెక్రెటరీ పూరెల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
సౌత్ జోన్ పోటీలకు అల్ఫోర్స్ స్టూడెంట్
కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెక్ట్స్ లో 9వ తరగతి చదువుతున్న ఎండీ యాసిర్ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక వావిలాలపల్లి అల్ఫోర్స్ స్కూల్ లో యాసిర్ ను ఆయన అభినందించారు. అక్టోబర్ 8న నల్గొండలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్‌కు యాసిర్ ఎంపికైనట్లు తెలిపారు.
బ్రిడ్జి ఎప్పుడు కడతవ్ సారూ!
మండల సభలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన సర్పంచ్
మెట్ పల్లి, వెలుగు : ‘మా పల్లెలో మిషన్ భగీరథ నల్లాలు ఇప్పటికీ బిగించలే.. ఇంటింటికీ నీళ్లు వస్తలేవు. బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికీ షురూ చేయలే. ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తవ్ సారూ..’ అంటూ కొండ్రికర్ల సర్పంచ్ ఆకుల రాజగంగు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ప్రశ్నించారు. సోమవారం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్రాజగంగు మాట్లాడుతూ సమస్యలపై ప్రశ్నించే ఎంపీ అరవింద్ ను అడగాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చెప్పడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మారు సాయిరెడ్డిని ఎంపీపీగా గెలిపిస్తే గ్రామ శివారు పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారని, ఎంపీపీగా గెలిచి రెండేళ్లు దాటినా ఇప్పటికీ బ్రిడ్జి పనులను ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
‘నిజాం షుగర్ రీ ఓపెన్ పై న్యాయ పోరాటం’
మెట్ పల్లి, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్కోసం న్యాయపోరాటం చేస్తామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ ఫ్లోర్ లీడర్, సుప్రీం కోర్టు న్యాయవాది కొమిరెడ్డి రాములు అన్నారు. సోమవారం మెట్పల్లిలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేసి తీరుతామన్నారు. ఫ్యాక్టరీ రీ ఓపెన్ కోసం 1000 రోజులు రిలే దీక్షలు చేసినా సర్కారు స్పందించడం లేదని అవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కోరుట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటికీ అన్ని సమస్యలు అలాగే ఉన్నాయన్నారు.
గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్
చొప్పదండి, వెలుగు: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని చొప్పదండి పోలీసులు అరెస్ట్‌చేశారు. సోమవారం చొప్పదండి సీఐ రవీందర్, ఎస్సై ఉపేంద్రాచారి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌కు చెందిన కారు డ్రైవర్ నలిమెల వినోద్(27), పెగడపల్లి మండలం వెంగలాయిపేటకు చెందిన రాచర్ల వంశీ(21), ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ ఎంప్లాయిగా పనిచేస్తున్న వెంగలాయిపేటకు చెందిన రాగాల ఆనంద్(19) కలిసి చొప్పదండిలో నివాసముంటున్నారు. గతంలో రెండు గంజాయి కేసులలో నిందితుడు, ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించిన నలిమెల వినోద్, వంశీ, ఆనంద్ ఒడిశా రాష్ట్ర సరిహద్దులోని కుంట గ్రామం నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నారు. సోమవారం ఉదయం ఎస్సారెస్పీ వద్ద గంజాయిని అమ్ముతున్నారని సమాచారం అందడంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. వారివద్ద 2,240 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
వికలాంగులకు చేయూతనివ్వాలి
సుల్తానాబాద్, వెలుగు: మానసిక వికలాంగులకు ప్రతిఒక్రూ చేయూతనివ్వాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి జీఎస్ఎల్ ప్రియాంక అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని జడ్జి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆమెవెంట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి శ్యాంసుందర్, శివకృష్ణ, రాజు, లోక్ అదాలత్ సభ్యులు లక్ష్మీకాంతరెడ్డి, రమేశ్, ఏపీఎం శ్రీనివాస్, అడ్వకేట్లు పాల్గొన్నారు.
‘అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం’
రాజన్న సిరిసిల్ల,వెలుగు : దుబాయ్‌లో చిక్కుకున్న యువకుల కుటుంబాలు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దొల్ల స్వామి, వీర్నపల్లికి చెందిన గుగులోత్ అరవింద్ కుటుంబాలను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అరవింద్ సోమవారం ఫోన్ లో మాట్లాడారు. అధైర్య ప డొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా దుబాయ్ ఎంబసీకి లెటర్ పంపించామని, వారంతా క్షేమంగా ఇంటికి వస్తారని భరోసా కల్పించారు. అలాగే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బీజేపీ మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు సాయిలు ఉన్నారు.
గ్రూప్-1ను పకడ్బందీగా నిర్వహించాలి
కరీంనగర్ సిటీ, వెలుగు:అక్టోబర్16న జరుగనున్న గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పరీక్ష ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు, ఎగ్జామ్స్జరుగనున్న కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. రైటింగ్ ప్యాడ్ లకు అనుమతి లేనందున కేంద్రాలలో టేబుల్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలను పంపిణీ మొత్తం సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయాలన్నారు. కేంద్రానికి అలస్యంగా వచ్చినవారిని అనుమతించొద్దన్నారు. ఎగ్జామ్ రాసేవారితో పాటు ఇన్ విజిలేటర్లకు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని అన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తదితరులు పాల్లొన్నారు.