మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన వెలువడినా భారత రాష్ట్ర సమితి ఉలుకూ -పలుకూ లేదు. అసలు ఆ పార్టీ జాతీయ పార్టీగా ఉందో, లేదో స్పష్టత లేదు. తెలంగాణలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ స్వరాష్ట్రంలో తప్ప మరెక్కడా క్రియాశీలకంగా లేదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ 'దుకాణం' మూతపడింది.
మహారాష్ట్రలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట మహారాష్ట్రను టార్గెట్ చేశారు. అప్పుడెప్పుడో మార్కెట్ కమిటీ ఎన్నికల్లో మాత్రమే పోటీచేసిన బీఆర్ఎస్ తర్వాత ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యాలయాలకు కూడా అద్దె చెల్లింపులను నిలిపివేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితులు తలకిందులయ్యాయి. మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుల లేఖపై బీఆర్ఎస్ హైకమాండ్ స్పందించినట్టు ఆధారాలు కూడా లేవు.
ఒక బలమైన 'ప్రాంతీయ నాయకుడి'గా గుర్తింపు, మర్యాద పొందిన కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్చి తెలంగాణ 'ప్రాంతీయ ఐడెంటిటీ'ని పోగొట్టుకున్నారు. కనుక, తాను ‘తవ్వుకున్న జాతీయ గోతి’ని తానే పూడ్చుకోవలసి ఉన్నది. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిన ప్రతి చోటా బీజేపీ చొచ్చుకొని వెడుతోంది. లేదా ఆ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నవి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీని ప్రాంతీయ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్‌సీపీ భర్తీ చేసింది. తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీ బలంగా లేవు. అక్కడ ప్రాంతీయ పార్టీలు.. తమ ఇలాకాలో జాతీయ పార్టీలు కాలుమోపకుండా అడ్డుకుంటున్నవి.
పార్టీ పునాదిని మర్చిపోయిన కేసీఆర్
తెలంగాణలో రేవంత్ రెడ్డి 'తుపాను'లో బీఆర్ఎస్ కొట్టుకుపోయింది. హైదరాబాద్ నగరవాసుల పుణ్యమా అని బీఆర్ఎస్ 39 సీట్లు గెల్చుకోగలిగింది. రేవంత్ రెడ్డి కాకుండా మరొకరు పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికల యుద్ధాన్ని నడిపి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్ల. కేసీఆర్ ట్రిక్కులు, మాయోపాయాలు, ఎత్తుగడలన్నింటినీ రేవంత్ ఆపోసన పట్టినందున బీఆర్ఎస్ వ్యూహాలను రేవంత్ చిన్నాభిన్నం చేయగలిగారు. రేవంత్ నాయకత్వంలో తమకు ఓటమి ఎదురుకాగలదని బీఆర్ఎస్ అంచనా వేయలేకపోయింది. ‘తెలంగాణ అస్తిత్వమే’ తమ పార్టీ పునాది అనే విషయాన్ని కేసీఆర్ మరచిపోయి, అత్యాశతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. అయితే ‘పురిటి గడ్డ’ తెలంగాణలో అధికారం కోల్పోయాక తత్వం బోధపడింది. పార్టీని పూర్తిగా గాలికి వదిలేసి, కేవలం ఎమ్మెల్యేలను, భజన బృందాలను నమ్ముకున్నందుకు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నట్టు కేటీఆర్ ఒప్పుకుంటున్నారు. కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు, అంతకుముందు కొన్ని రాష్ట్రాలలో పర్యటనలు తెలంగాణ వెలుపల పెద్దగా సంచలనం సృష్టించలేకపోయాయి. దీనికి కారణం ఆయన ‘నమ్మదగిన’ రాజకీయ నాయకుడు కాదన్న అభిప్రాయం దేశంలోని మిగతా పార్టీలలో ఉండడమే!
కేసీఆర్ స్వార్థపూరిత రాజకీయాలు
కేసీఆర్ నిజాయితీతో రాజకీయాలు నడపరని, ‘అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు ఒక నమూనా’ అని ఢిల్లీ రాజకీయ, మీడియా వర్గాల్లో చాలాకాలంగా ఒక టాక్ ఉన్నది. నిజానికి 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ నేలమీదనే నడిచారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక నేల విడిచి సాము చేయడం ప్రారంభించారు. కొంతకాలం ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. తర్వాత జాతీయపార్టీ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో ఆయన కాళ్ళకింద భూమి కదిలిపోయింది.
ఇంతకీ బీఆర్ఎస్ ఏ పార్టీ ?
‘ప్రస్తుత ప్రభుత్వం తీరుచూసి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలంతా ఇప్పుడు గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు. మనం పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర మనకు కొత్త. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనార్హం. జాతీయ రాజకీయాలను వదలి మళ్లీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్ వ్యాఖ్యల సారాంశం. ఇంతకీ ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీయా? ఆపార్టీ అధినేత అధికారికంగా చెప్పే స్థితిలో లేకపోవడం, ఆ పార్టీ దైన్యస్థితిని తెలియజేస్తోంది.
బయటపడిన కేసీఆర్ అసలు రూపం
ఉద్యమ ఆకాంక్షల పునాదులపైన నిర్మించిన టీఆర్ఎస్కు, ఇతర ప్రాంతీయ పార్టీలతో పోలిక లేదు. టీఆర్ఎస్ ‘రాజ్యాంగం’ వేరు. కేసీఆర్ ‘సిలబస్’ వేరు. ఆయనే ఒక యూనివర్సిటీ. ‘ఫక్తు రాజకీయపార్టీ’ అని ప్రకటించిన నాటి నుంచే మిగతా పార్టీల లక్షణాలన్నీ వచ్చేశాయి. తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుపోయిన ప్రజలు, కార్యకర్తలతో కేసీఆర్ ‘డిస్కనెక్టు’ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఆయన పూర్తిగా ‘కటాఫ్ ఏరియా’లోకి వెళ్ళిపోవడం పార్టీని చావుదెబ్బ తీసింది. పార్టీ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే పార్టీ.. అనే ధోరణిని ప్రదర్శించారు.
సంస్థాగత నిర్మాణమే డొల్ల
బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై ఇప్పుడు కళ్ళు తెరిచినా ఫలితం శూన్యం. 2001 నుంచి ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం డొల్ల. అయితే ఉద్యమ భావోద్వేగ వేడిలో దాన్ని ఎవరూ గుర్తించలేదు. కేసీఆర్‌ను గుడ్డిగా అందరూ ఫాలో అయ్యారు. ఆయన అసలు రూపం 2014 తర్వాత బయటపడ్డాక కార్యకర్తలకు కనువిప్పు అయ్యింది. 2018 నుంచి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండో టర్మ్ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన బాగోతం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భజన బృందం హైదరాబాద్ నగరాన్ని చాలా మేరకు నంజుకు తిన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నవి. తమకు బీఆర్ఎస్ వల్ల ఎలాంటి ప్రయోజనం రాలేదని, కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు, కేసీఆర్ కుటుంబసభ్యులే తెలంగాణను లూటీ చేసినట్టు కార్యకర్తలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు.
రాజరికపు పోకడలతో బీఆర్ఎస్ పాలన
‘రెండున్నర జిల్లాల’ వలసవాదులు, పెట్టుబడిదారులు, సంపన్నులకు కొమ్ముగాసి, సామాన్య కార్యకర్తలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ‘కోట’లు కట్టుకొని, ఫార్మ్ హౌస్‌లు ఏర్పాటు చేసుకొని, రాజరికపు పోకడలతో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి కొన్ని వర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు దూరమయ్యారు. కేసీఆర్, కేటీఆర్‌ను వారు మళ్ళీ నమ్మడానికి సిద్ధంగా లేరని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నవి. మూడోసారి కూడా అధికారంలోకి వస్తే మనుషులను ‘బానిసలకంటే హీనంగా’ చూసేవారని, ‘నీ బాంచన్ కాల్మొక్తా’ వంటి పరిస్థితులు తలెత్తేవని ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ప్రతిష్ఠ అడ్డొస్తున్నట్టుంది!
ఇరవై మూడేండ్లుగా కేసీఆర్ ను ‘తెలంగాణ కేసీఆర్’ గానే భారతదేశం చూస్తోంది. తెలంగాణకు ఆయన రాజకీయ పర్యాయపదం అయ్యారన్న పొగడ్త కూడా ఉన్నది. కానీ, తానే నిర్మించుకున్న ‘ప్రాంతీయత’ కట్లు తెంచుకుని కేసీఆర్ జాతీయనేతగా ఎదగలేనని ఆయన అనుకోలేదు. కాగా, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్‌ను వెనక్కి నెట్టివేసి, తెలంగాణవాదాన్ని నిలబెట్టే నాయకునిగా, కేసీఆర్ కంటే గొప్పగా పాలించాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్నారు. ఆయన క్రమంగా కేసీఆర్ స్థానాన్ని ఆక్రమించుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మొత్తం మీద టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి బొక్కబోర్లాపడ్డ కేసీఆర్.. ఉనికే లేని తన ‘జాతీయ పార్టీ జెండా’ను పీకేసినట్టేనా, లేదా? రాజకీయంగా ఇప్పటికే పరువు పోయిన క్రమంలో ఆ విషయం చెప్పడానికి ప్రతిష్ఠ అడ్డొస్తున్నట్టుంది!
– ఎస్.కె. జకీర్,సీనియర్ జర్నలిస్ట్-