Aaron Finch: సొంత అభిమానుల కోసం చివరి మ్యాచ్.. ఆసీస్ దిగ్గజానికి అరుదైన గౌరవం

Aaron Finch: సొంత అభిమానుల కోసం చివరి మ్యాచ్.. ఆసీస్ దిగ్గజానికి అరుదైన గౌరవం

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ అరోన్ ఫించ్(Aaron Finch) ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. చివరిసారిగా శనివారం(జనవరి 13) సొంత అభిమానుల కోసం మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున తన ఆఖరి మ్యాచ్ ఆడి ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. 

బిగ్ బాష్ లీగ్ (BBL)లో మొత్తం 13 సీజన్‌లలో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు.. ఫించ్ మాత్రమే. ఇందులో 11 సీజ‌న్లలో సార‌థిగా వ్యవ‌హ‌రించాడు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ యాజమాన్యం అతనికి అరుదైన గౌర‌వం క‌ల్పించింది. గార్డ్ ఆఫ్ హానర్‌గా అతని జెర్సీ నెంబర్.5కి రిటైర్మెంట్ ప్రక‌టించింది. ఇక‌పై ఫించ్ 5వ నెంబర్ జెర్సీని గ్యాల‌రీలో ఉంచనున్నారు. ఫించ్ తన చివరి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, అతని జట్టు విజయం సాధించింది. దీంతో సంతోషంగా అతను తన కెరీర్‌ను ముగించారు.

ఫించ్ సారథ్యంలో మెల్‌బోర్న్‌ రెనెగ్రేడ్స్ ఒకే ఒకసారి చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. 2081-19 సీజన్ లో టైటిల్ ను ముద్దాడింది. ఇక వ్య‌క్తిగ‌త రికార్డుల విషయానికొస్తే.. బీబీఎల్‌ టోర్నీలో ఫించ్ 106 మ్యాచుల్లో 3,311 ప‌రుగులతో అత్య‌ధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. ఇక జాతీయ జట్టు విషయానికొస్తే ఫించ్ వ‌న్డేలు, టీ20ల్లో సార‌థ్యం వ‌హించాడు. అత‌ని కెప్టెన్సీలో ఆసీస్ 2021లో టీ20 ప్రపంచ‌ క‌ప్‌ విజేతగా నిలిచింది.