కేస్లాపూర్​లో వేడుకగా నాగోబా విగ్రహప్రతిష్ఠ

ఇచ్చోడ, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా ఆలయ పున:ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఆదివారం కన్నులపండువగా జరిగాయి. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో కొత్తగా కట్టిన గుడిలో ఆదివాసీ పెద్దలు ఆత్రం పురుషోత్తం మహరాజ్, కోడప వినాయక్ మహరాజ్, భీంరావ్ మహరాజ్ ఆధ్వర్యంలో నాగోబా, సతీక్ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మందిర ఆవరణలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు.

గర్భగుడి గోపురంపై కలశం ఏర్పాటు చేసి హోమం నిర్వహించారు. ఇందులో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు పటేల్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. నాగోబా విగ్రహ ప్రతిష్ఠ, కొత్త గుడి ప్రారంభ వేడుకలకు ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ లు రాథోడ్ జనార్దన్, కోవా లక్ష్మి, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, గోడం నగేశ్, సుహాసిని రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అలాగే ఉమ్మడి జిల్లా నుంచి మెస్రం వంశస్థులు, భక్తులు వేలాదిగా తరలి వచ్చి పూజలు చేశారు. నాగోబాను దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.