మళయాళ సాహిత్యంలో గాడ్ ఫాదర్.. MT వాసుదేవన్ నాయర్ కన్నుమూత

మళయాళ సాహిత్యంలో గాడ్ ఫాదర్.. MT వాసుదేవన్ నాయర్ కన్నుమూత

ప్రముఖ రచయిత, డైరెక్టర్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మళయాళ సాహిత్యంలో గాడ్ ఫాదర్ గా పిలుచుకునే  MT వాసుదేవన్ (91) నాయర్ కన్నుమూశారు.  కేరళలోని కోజికొడ్ లో అయన తుదిశ్వాస విడిచారని ముఖ్యమంత్రి పినరవి విజయన్ కార్యాలయం ధృవీకరించింది. నాయర్ కు నివాళి అర్పిస్తూ డిసెంబర్ 26, 27 తేదీలను సంతాప దినాలుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సమావేశాలు, కార్యక్రమాలు అన్నింటిని ఈ రెండు రోజులు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మళయాళ ప్రజలు ముద్దుగా పిలుచుకునే MT ఇక లేరని తెలిసి సినీ, సాహితీ రంగాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 మళయాళ సాహిత్య, సినిమా రంగాలపై చెరగని ముద్ర వేశారు MT. నవలలు, కథలు, కథానికలు, స్క్రీన్ ప్లేలు, బాలల సాహిత్యం, ట్రావెల్ రచనలు మొదలైన ఎన్నో రకాల రచనలతో కేరళతోపాటు భారతదేశంలోనే ప్రముఖ రచయితగా పేరుగాంచారు. మళయాళంలో సూపర్ హిట్ అయ్యి ఇతర భాషల్లో రీమేక్ అయిన ‘నిర్మల్యమ్’ తో పాటు మరో ఐదు సినిమాలు తీశారాయన. అదే విధంగా రెండు డాక్యుమెంటరీలు కూడా తీసి ఆకట్టుకున్నారు. 

ALSO READ | ముఖ్యమంత్రిని చేస్తాం.. పార్టీలోకి వచ్చేయ్ అన్నారు: సోనూసుద్

వాసుదేవన్ నాయర్ 1933లో కేరళ పాలక్కడ్ జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చదవడమంటే చాలా ఇష్టపడే నాయర్ ను బాల్యంలో తల్లిదండ్రులు చదువు విషయంలో అంతగా ప్రోత్సహించలేదట. అయినప్పటికీ యుక్త వయసు నుండే రాయడం మొదలు పెట్టిన నాయర్ రచనలు చిన్నవయసులోనే వివిధ మ్యాగజైన్లలో పబ్లిష్ అయ్యేవట. ‘‘అందరి పిల్లల లాగా నాకు ఆటలు అంటే ఇష్టం ఉండదు.. నాకు బాగా నచ్చిన ఒకే ఒక ఆట చదవటం’’ అని చెప్పేవారట నాయర్. అంటే చదవటం పై ఆయనకున్న శ్రద్ధ ఏంటో ఆ మాటతోనే అర్థం అవుతుంది. 

రాయటం అలవాటుగా మారిన నాయర్.. ‘మాతృభూమి’ మ్యాగజైన్ లో చేరి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. మ్యాగజైన్ ను టాప్ రీడింగ్ మ్యాగజైన్ గా మార్చడమే కాకుండా మోస్ట్ రీడర్స్ ఉన్న మ్యాగజైన్ గా మార్చారట. స్వాతంత్ర్యానికి ముందు జన్మించిన నాయర్.. ప్రతి దశలో వస్తున్న మార్పులను స్వీకరిస్తూ వచ్చేవారట. తరం మారే కొలది ఆ తరం ఆలోచనలతో ఆయన రాసిన రచనలు అన్ని తరాల అభిమానులను సంపాదించాయి. 

ఆయన రచించిన ‘నాలుకెట్టు’ (Four blocks) నవల 1959లో కేరళ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకుంది. అదే విధంగా‘రందమూఝమ్’ (The Second Turn).. మహాభారతాన్ని భీముని పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పిన నవల.. భారత సాహిత్యంలోనే ఎపిక్ నవలగా పేరు తెచ్చుకుంది. ఆయన సాహిత్యంలో చేసిన సేవలకు గాను జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. అదే విధంగా ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మభూషణ్, జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఇలా ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.