![ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆగాఖాన్ కన్నుమూత.. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో తుదిశ్వాస](https://static.v6velugu.com/uploads/2025/02/renowned-mystic-aga-khan-passed-away-in-lisbon-portugal_c4zpQTrAw2.jpg)
- ప్రపంచ వ్యాప్తంగా పలు సేవలు కార్యక్రమాలు చేపట్టిన ఆగాఖాన్
- 2015లో పద్మవిభూషణ్‌తో సత్కరించిన భారత ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ గ్రహీత ఆగాఖాన్(88) కన్నుమూశారు. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆగాఖాన్ సొసైటీ ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లో పుట్టిన ఆగాఖాన్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉంది. ఆయన ప్రపంచ వ్యాప్తంగా పలు విద్యాసంస్థలు, దవాఖానలు, కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 1957లో తన 20వ ఏటనే ఆగాఖాన్ ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రాల పెంపకంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపారాల్లో రాణించారు. ఆగాఖాన్‌కు కింగ్ చార్లెస్ కుటుంబసభ్యులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన మరణానికి కింగ్ చార్లెస్ 3 తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 1967లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
హైదరాబాద్‌తో అనుబంధం..
హైదరాబాద్‌లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ఎన్నో సేవలు అందిస్తున్నది. హాస్పిటల్స్, మహేశ్వరం సమీపంలో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, కల్చరల్ సెంటర్స్ ఎన్నో నెలకొల్పారు. హైదరాబాద్ అస్తిత్వ కట్టడాలను పునరుద్ధరించడంలో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కృషి మరువలేనిది. కుతుబ్ షాహి టూంబ్స్, సైదానీ మా టూంబ్స్, పైగా టూంబ్స్ ఇలా చారిత్రక కట్టడాల పరిరక్షణకు ఆగాఖాన్ ట్రస్ట్ చర్యలు తీసుకుంది.
కుతుబ్ షాహీ టూంబ్స్‌లో ఉన్న మెట్ల బావులను ఆగాఖాన్ ట్రస్ట్ ఆధునీకరించింది. వీరి కృషి వల్ల 2022లో టూంబ్స్‌లో ఉన్న మెట్ల బావులకు యునెస్కో గుర్తింపు లభించింది. ఆగాఖాన్ కమ్యూనిటీ అయిన ఇస్మాయిలీలకు హైదరాబాద్‌తో ఏండ్ల అనుబంధం ఉంది. అబిడ్స్‌లోని చిరాగ్ అలీ లేన్‌లో ఆగాఖాన్ కమ్యూనిటీకి చెందిన ఇస్మాయిలీలే కనిపిస్తారు. కాగా, ఆగాఖాన్ మరణం పట్ల సీఎం రేవంత్ సంతాపం ప్రకటించారు. ఆయన తమరణం మానవాళికి తీరని లోటన్నారు. పేదరిక నిర్మూలన, వారసత్వ సంపద పరిరక్షణ, వైద్య, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివన్నారు.