కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ భాష్యం విజయ సారథి (86) కన్నుమూశారు. అర్ధరాత్రి దాటాక సుమారు ఒకటిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ సారథి.. కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
శ్రీ భాష్యం విజయసారథి పాండిత్యం, గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. మందాకిని కావ్య కవిగా ప్రసిద్ధిగాంచిన శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషలో దిట్ట. ఆయన మధుర మనోహరంగా కవిత్వం చెప్పడంలో మంచి ప్రావీణ్యం సాధించడంతో మహాకవిగా మన్ననలను అందుకున్నారు.
దేశ వ్యాప్తంగా జరిగిన కవి సమ్మేళనాల్లో పాల్గొనడమే కాకుండా, క్రతువుల నిర్వహణలో ఆయన సుప్రసిద్ధులు. విజయసారథి చేసిన సేవలకు గానూ ఆయన ఇప్పటికే అనేక రివార్డులు, అవార్డులు అందుకున్నారు. ఆయన చేసిన సాహిత్య సేవకు గానూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళీశ్వర రావు చేతులమీదుగా మహాకవి బిరుదు అందుకున్నారు.
కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించిన విజయసారథి 7వ ఏటనే పద్య రచన చేయడం ప్రారంభించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే అయినప్పటికీ సంస్కృత పండితుడిగా రాణించారు. కరీంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ లో యజ్ఞ వరాహ స్వామి ఆలయాన్ని స్థాపించి హిందు ధర్మ రక్షణకు కంకణం కట్టుకున్న మహోన్నత వ్యక్తిగా అక్కడి ప్రజలకు సుపరిచితమయ్యారు.
బాల్యంలో తన తల్లి నుంచి "న్యాయ బోధిని", "తార్క సంగ్రహము", మీమాంసను నేర్చుకున్నారు. ఈక్రమంలోనే ఆయన 11 సంవత్సరాల వయసులో "శారద పదకింకినే"ని స్వరపరిచారు. 16వ ఏట రచించిన "విశాదలహరి", "శబరీ పరిదేవనం", 17 సంవత్సరాల వయస్సులో "మనోరమ" నవల, 18 సంవత్సరాల వయస్సులో "ప్రవీణ భారతం" అనే నవలలను రచించారు. ఇలా 22 ఏళ్లకే కవిగా తనదైన ముద్ర వేశారు. సంస్కృతం, తెలుగులో 100కి పైగా పుస్తకాలు రచించారు.
బాల్యం నుంచే ఖండ కావ్యాల రచనలతో భాష్యం విజయసారథి అద్భుతమైన పాండిత్యాన్ని ప్రదర్శించారు. ‘సీసం’ అనే తెలుగు కవితా రూపాన్ని ప్రవేశపెట్టారు. అలాగే సంస్కృతంలో ఎపిస్టోలరీ రూపాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా ప్రసిద్ధికెక్కారు. ముఖ్యంగా తన కవిత్వంలో గరిష్ట సంఖ్యలో 'ధాతు'లను ఉపయోగించి వెలుగులోకి వచ్చారు.
సాహిత్యం, విద్యా విభాగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ సహా ఎన్నో అవార్డులు, రివార్డులు సొందిన విజయసారథి సంస్కృత భాషా ప్రచారం కోసం ఉద్యమించారు. మహాకవి విజయ సారథి మృతి తెలుగు భాషాభిమానులు, పండితులను దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీభాష్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు.. వివిధ వర్గాల నేతలు, అధికారులు, అభిమానులు సంతాపం ప్రకటించారు.