తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం

తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం
  •     రమేశ్ కార్తీక్ రాసిన ‘ఢావ్లో’ కథా సంకలనానికి అవార్డు
  •     పి. చంద్రశేఖర్ ఆజాద్​కు సాహిత్య బాల పురస్కారం
  •     త్వరలో అవార్డులు ప్రదానం చేయనున్న సాహిత్య అకాడమీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన బంజారా బిడ్డ, ప్రముఖ రచయిత రమేశ్  కార్తీక్  నాయక్​కు 2024 ఏడాదికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య యువ పురస్కారం  అవార్డు వరించింది. తెలుగులో రమేశ్ రాసిన ‘ఢావ్లో– గోర్’ బంజారా కథలు(చిన్న కథలు) ఈ పురస్కారానికి ఎంపికైంది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్  కౌశిక్  నేతృత్వంలో కార్యనిర్వహక బోర్డు శనివారం సమావేశమై 23 మంది రచయితలను యువ పురస్కార్, 24 మంది రచయితలను బాల పురస్కార్  అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, బెంగాల్, ఇంగ్లీష్  వంటి 23 భాషల్లో రచయితలు రాసిన పుస్తకాలకు అవార్డులు ప్రకటించింది. 

తెలుగులో రమేశ్  కార్తీక్  నాయక్  రాసిన ‘ఢావ్లో’కు యువ పురస్కార్, ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు చెందిన పి.చంద్రశేఖర్ ఆజాద్ రాసిన ‘మాయాలోకం’ పుస్తకానికి బాల పురస్కార్  అవార్డులు ప్రకటించింది. తెలుగులో యువ పురస్కార ఎంపికకు ప్రొఫెసర్  సూర్య ధనంజయ్, ఆర్. సీతారామరావు, శిఖామణి (కె సంజీవరావు) జ్యూరీలుగా వ్యవహరించారు. అలాగే బాల సాహిత్య పురస్కారం ఎంపికకు డాక్టర్  సీహెచ్  లక్ష్మణ చక్రవర్తి, డీకే చదువుల బాబు, డాక్టర్  పీఎస్  గోపాలకృష్ణ జడ్జీలుగా వ్యవహరించారు. సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో వీరికి అవార్డులు అందించనున్నారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రంతో పాటు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సాహిత్య అకాడమీ వెల్లడించింది. 

సాహిత్యంలో వికసించిన ‘తండా’ వాసి

నిజామాబాద్ జిల్లా గోర్ బంజారా కుటుంబంలో (జక్రాన్ పల్లి తండా) జన్మించిన రమేశ్  కార్తీక్  నాయక్  చదువుకునే నాటి నుంచే కవిత్వం, కథలు రాయడంపై మక్కువ పెంచుకున్నాడు. ఆయన అసలు పేరు సునావత్ కార్తీక్  కాగా... మిత్రుడిపై అభిమానంతో రమేశ్  కార్తీక్  నాయక్​గా పేరు మార్చుకున్నాడు. గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, సుఖదుఖాలను లోతుగా పరిశీలించాడు. ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త దారుల్ని వెతుకుతుంటే తన సమాజం ఇంకా అవే నమ్మకాల్ని గుడ్డిగా నమ్ముతూ గతంలోనే జీవిస్తున్నదని అతను ఆవేదన చెందేవాడు. తను చూసిన బతుకుల్ని, వెతల్ని, కథల్ని కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. 

ఆ క్రమంలో రాసిన తొలి కవితా సంపుటి ‘బల్దేర్‌‌ బండి’2018లో ప్రచురణ పొంది ప్రశంసలు అందుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన విద్యా సదస్సులో రమేశ్​ను సన్మానించారు. అలాగే ఖమ్మంలో నవ స్వరాంజలి సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. తర్వాత బల్దేర్‌‌ బండిలోని జారేర్‌‌ బాటి (జొన్నరొట్టెలు) అనే కవితను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు సాహిత్యంలో ఒక పాఠంగా పొందుపరిచింది. ప్రస్తుతం సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైన ఢావ్లో కథా సంకలనంలోని ‘పురుడు కథ’ ఆంగ్లంలోకి అనువాదమైంది. ఎక్స్‌‌చేంజెస్  సాహిత్య అనువాద జర్నల్‌‌లో ఈ కథ ప్రచురితమైంది. అంతేకాకుండా రమేశ్  కవితలు ఆంగ్లం, హిందీ, కన్నడ, మళయాళం భాషల్లోనూ అనువాదమయ్యాయి.