- ఇబ్బందులు పడుతున్న టీచర్లు, ఆయాలు
- సూర్యాపేట జిల్లాలో 463 రెంటెడ్ బిల్డింగులు
సూర్యాపేట, వెలుగు : చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో మెజార్టీ అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఐదునెలలుగా నిధులు రాకపోవడంతో టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో భవన యజమానులకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల సిబ్బందే సొంత డబ్బుతో అద్దె చెల్లిస్తున్నారు.
1,209 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లా పరిధిలో చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అర్బన్ పరిధిలో 5 ప్రాజెక్టులు ఉండగా.. 1,209 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 28,479 మంది చిన్నారులు, 12, 797 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. 1,209 కేంద్రాల్లో 311 సొంత భవనాలు కాగా.. 435 కేంద్రాలు ఇతర ప్రభుత్వ భవనాల్లో రెంట్‌ఫ్రీగా నడుస్తున్నాయి. మరో 463 సెంటర్లు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
అద్దె చెల్లింపులో జాప్యం
అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు అర్బన్‌ప్రాంతాల్లో రూ.3 నుంచి రూ. 5వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 నుంచి రూ. 4 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 463 కేంద్రాలకు నెలకు రూ.10లక్షల అద్దె చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నుంచి రూ. 60లక్షలు విడుదల కాగా.. సూర్యాపేట అర్బన్, తుంగతుర్తి ప్రాజెక్టుల పరిధిలోని 180 కేంద్రాలకు మార్చి 2023 నుంచి ఆగస్టు వరకు రూ.36.44 లక్షలు చెల్లించారు. చివ్వెంల, హుజూర్‌నగర్, కోదాడ, పరిధిలో 283 కేంద్రాలకు రూ. 23.56 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రెంట్‌కు సంబంధించి నిధులు మంజూరు కాలేదు.
రూ. 50 లక్షలు పెండింగ్
463 కేంద్రాలకు రూ.50 లక్షల అద్దె చెల్లించాల్సి ఉంది. భవన యజమానులు ఒత్తిడి చేస్తుండడంతో కొన్నిచోట్ల సిబ్బందే రెంట్ కడుతున్నారు. తమకు వచ్చేదే రూ.11,500 జీతంలో అద్దెలకు సగం పోతే.. కుటుంబాలు ఎలా నెట్టుకురావాలో అర్థం కావడంలేదని పలువురు అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నెలవారీ కరెంటు చార్జీలు, గ్యాస్ బిల్లు భారం కూడా తమపైనే పడుతోందని, సూపర్‌వైజర్లు, సీడీపీవోలు సెంటర్లను తనిఖీలు చేసి రికార్డుల నిర్యహణ సక్రమంగా లేదని ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు.
బడ్జెట్ రాగానే విడుదల చేస్తం
ఇటీవల వచ్చిన బడ్జెట్‌తో 2023 ఆగస్టు వరకు అద్దె చెల్లించినం. మిగిలిన నెలలకు సంబంధించి బడ్జెట్ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినం. అక్కడి నుంచి రాగానే రెంట్ కట్టేస్తం.
జ్యోతి పద్మ, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ అధికారిణి
ఏడాదిగా అద్దె కడుతున్న
మేళ్లచెరువులోని 5 వ అంగన్వాడీ సెంటర్ అద్దె భవనంలో నడుస్తోంది. గవర్నమెంట్ నుంచి ఏడాదిగా అద్దె రావడం లేదు. దీంతో నా సొంత డబ్బులు చెల్లిస్తున్నం. ఇప్పటి వరకూ రూ.10 వేలు అద్దె కింద చెల్లించిన.
శాలిలేటి శ్రీలలిత, అంగన్వాడీ టీచర్, మేళ్లచెర్వు