కిరాయికి సాగు పనిముట్లు

కిరాయికి సాగు పనిముట్లు

మహిళా సంఘాల ద్వారా పంపిణీ
పైలట్ ప్రాజెక్టుగా ఆరు జిల్లాలు ఎంపిక చేసిన సర్కారు
రూ. 1.58 కోట్లు మంజూరు

కరీంనగర్, వెలుగు: మన రాష్ట్రంలో చాలామంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. పెద్ద రైతుల భూములు కూడా వీరే కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. సాగు చేసే భూమి విస్తీర్ణం ఎక్కువగానే ఉంటుంది. వీరికి దున్నడానికి, కోతకు, నాట్లు వేయడానికి కూలీలు, యంత్రాల కిరాయిలకే ఎక్కువగా ఖర్చవుతుంటాయి. అలాంటి రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. గ్రామాల్లో ఉన్న పొదుపు మహిళా సంఘాల ద్వారా వ్యవసాయానికి పనికొచ్చే ఉపకరణాలను సమకూర్చి.. వాటిని రైతులకు తక్కువ రేటుకే కిరాయికి ఇవ్వనున్నారు. ఇందుకోసం వ్యవసాయ ఉపకరణాల అద్దె కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారే దీన్ని అమలు చేయకుండా తొలుత పైలట్ ప్రాజెక్టుకింద ఆరు జిల్లాల్లో చేపడుతున్నారు. ఈ జిల్లాల్లో అమలు తీరు, సక్సెస్ రేట్ చూసి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నారు.

ఏడాదిగా కసరత్తు
ప్రస్తుతం మన దగ్గర ఎక్కువ సాగు విస్తీర్ణం ఉన్న రైతులే ఆధునిక యంత్రాలు వాడుతున్నారు. కానీ తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులు వాటి జోలికి కూడా పోవడం లేదు. ఎందుకంటే వాటిని కొనుగోలు చేసే సామర్ధ్యం ఉండదు. లక్షలు పోసి కొనుగోలు చేసినా నిర్వహణ భారంగా మారుతుందని వారి అభిప్రాయం. అందుకే సొంతంగా కొనుగోలు చేసే శక్తి లేక, వాటిని అద్దెలను భరించలేక చాలామంది రైతులు కూలీల మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు. సామాన్య రైతులకు కూడా ఇలాంటి ఆధునిక సాగు ఉపకరణాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో అద్దెకు ఉపకరణాలు ఇచ్చే స్కీమ్ కు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. దీని మీద గత ఏడాదిగా కసరత్తు చేస్తోంది. అసలు ఈ స్కీమ్ ను ముందుకు ఎలా తీసుకుపోవాలి, ఎవరిని భాగస్వాములను చేయాలనే విషయాలను ఆలోచించారు. ఎంపిక చేసిన మండలాల్లో నిరుపేదలు అధికంగా ఉన్న గ్రామాల్లోని పొదుపు సంఘాల పనితీరును పరిశీలించారు. అక్కడ వారి పనితీరు బాగానే ఉందని గ్రహించిన తర్వాత సంఘాల మహిళలతో కూలీలు, వరి
కోత యంత్రాలు, ట్రాక్టర్లు ఉన్న యజమానులతో సమావేశాలు నిర్వహించారు. వారు ప్రస్తుతం దున్నడానికి, కోతలకు తీసుకుంటున్న కిరాయిల గురించి తెలుసుకున్నారు. అయితే ఈ రేట్లు సాధారణ పేద రైతులకు భారంగా మారుతున్నాయని వీరి పరిశీలనలో వెల్లడైంది. దీంతోపాటు
రైతులకు క్షేత్రస్థాయిలో ఎక్కువగా ఉపయోగపడే పనిముట్ల వివరాలను వారినడిగి తెలుసుకున్నారు. ఏవి అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయాలు సేకరించారు. గ్రామాల్లో ఈ పనిముట్లను కిరాయికి ఇవ్వడానికి, వాటిని నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న మహిళా పొదుపు సంఘాలను ముందుకు రమ్మని పిలిచారు. ఇలా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఓ కొలిక్కి వచ్చాక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని మండలాలను ఎంపిక చేశారు.

పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన జిల్లాలు
రాష్ట్రంలోని మొత్తం ఆరు జిల్లాలను ఈ పైలట్ ప్రాజెక్టుకింద ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలానికి రూ. 25లక్షలు, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు రూ. 26 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు రూ. 25లక్షలు, జనగామ జిల్లా దేవరుప్పులకు రూ. 27లక్షలు, నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి రూ. 29 లక్షలు, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి రూ.26 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో ఏ పనిముట్లువస్తాయి.. ఎన్ని వస్తాయనేది కమిటీ నిర్ణయం మేరకు కొనుగోలు చేసి.. గ్రామంలోని రైతులకు కిరాయికి ఇవ్వనున్నారు. ఇది సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మహిళా సంఘాలే కీలకం
ఎంపిక చేసిన జిల్లాలోని మహిళా మండల సమాఖ్యలు ఈ పథకంలో కీలకపాత్ర పోషించనున్నాయి. ఆరు జిల్లాల్లోని ఆరు పొదుపు మహిళా సంఘాలకు యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ. 1.58 కోట్లు మంజూరు చేశారు. ఈ యంత్రాల కొనుగోలు, నిర్వహణ తదితర వ్యవహారాలకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్ గా, డీఆర్డీవో కన్వీనర్ గా ఉంటారు. వీరితోపాటుగా జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యాన అధికారులు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా వ్యవహరిస్తారు. కొనుగోలు చేసిన తరవాత ఈ కమిటీయే పరికరాలు కిరాయికి ఇవ్వడంపై నిరంతరం పర్యవేక్షిస్తుంది.

For More News..

సీనియర్ను కాల్చిచంపి.. తనూ కాల్చుకున్నడు

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్

యూఎస్ సర్కార్‌‌‌‌పై ఇండియన్ మహిళ కేసు