
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అడవుల నరికివేతపై సినీ నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందించింది. లేటెస్ట్గా తన ఇంస్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస్తూ 400 ఎకరాల్ని వదిలేయాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసింది. జంతువులు, పర్యవరణానికి ప్రమాదం తీసుకురావొద్దంటూ, భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ తమ గొంతుని వినిపించింది. వివరాల్లోకి వెళితే..
ఏపీ డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణూ దేశాయ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో తాను మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపం అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది.
రేణూ దేశాయ్ మాటల్లోనే.. "మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపం. నాకు రెండు రోజుల క్రితం HCU భూముల వ్యవహారం గురించి తెలిసింది. కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నా. సార్.. ఒక తల్లిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.. నాకు ఎలాగో 44 ఏళ్లు వచ్చేశాయ్.. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలు, మన అందరి పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం. మాకు ఆక్సిజన్ కావాలి.. మాకు నీళ్లు కావాలి.. మాకు ఐటి పార్క్స్, భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు కావాలి. అయితే అభివృద్ధి అనేది 100 శాతం ముఖ్యం. అందులో ఎలాంటి అనుమానం లేదు.
కానీ ఒక్క శాతం వీలైనా సరే ఈ 400 ఎకరాల్ని మాత్రం వదిలేయండి. ఈ రాష్ట్రానికి చెందిన పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నా.. దయచేసి దీన్ని వదిలేయండి. మన దగ్గర ఎన్నో ఇతర ల్యాండ్స్ ఉన్నాయి. మీరందరు నాకంటే ఏంతో సీనియార్స్. మీకు నాకంటే ఏంతో అనుభవం ఉంది. వాటిని అభివృద్ధి చేయండి.
ఈరోజు ఒక తల్లిగా నేను వేడుకుంటున్నా.. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ఇందులో నా స్వార్థం లేదు. అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు.. ఒక నగరం అభివృద్ధి చెందడం వల్లే మనం ఇక్కడ ఉన్నాం.. కానీ ఆ 400 ఎకరాలు మాత్రం వదిలేయండి.. మనకి ఆక్సిజన్, చెట్లు, నీళ్లు, జీవ వైవిధ్యం అంతా చాలా ముఖ్యం. ఒకసారి పునరాలోచించండి. అధికారులు, మంత్రులు, ప్రభుత్వం దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను." అంటూ రేణూ దేశాయ్ తెలంగాణ సీఎంకి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది.