కాంగ్రెస్ సునామీలో కేసీఆర్ ​కొట్టుకపోతడు : రేణుకా చౌదరి

  • కాంగ్రెస్ సునామీలో కేసీఆర్ ​కొట్టుకపోతడు
  • బీఆర్ఎస్‌లో ఎంతమంది కోవర్ట్‌లు ఉన్నారో మాకు తెలుసు
  • పువ్వాడ అజయ్ ని పాలు పోసి పెంచినా కాటేస్తడు
  • కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామీలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10కి 10 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సునామీ బీఆర్‌ఎస్‌ను కదిలించి ఓడిస్తుంది. మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్‌ఎస్ నేతలు మా కార్యకర్తలపై  దాడులు చేస్తున్నరు.. ఖమ్మం నేత రఫీదా బేగంపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తున్నరు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నరు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడి గెలుస్తారని అనుకుంటున్నారా? మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్.. అజయ్. నువ్వు‌ఓడిపోయిన మరుక్షణం అక్కడి నుంచి పారిపోతావ్. పువ్వాడ అజయ్ పాము, తేలు లాంటోడు.. పాలు పోసి పెంచినా కాటు వేస్తడు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కట్టగానే కూలిపోయే డబుల్ బెడ్రూం ఇండ్లే కేసీఆర్ సర్కార్‌ను కూల్చేస్తాయి. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నయ్.. మత రాజకీయాలకు పాల్పడుతున్నయ్. ఎగ్జిట్ పోల్స్ లెక్కదేముంది.. నా పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది. ఎక్కడైనా మేం ప్రచారం చేస్తం.. అయితే నా ఫోకస్ ఖమ్మంపైనే. బీఆర్ఎస్​లీడర్లు దాడులు చేస్తారని మేము పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా? బీఆర్‌ఎస్‌లో ఎంతమంది కోవర్ట్‌లు ఉన్నారో మాకు తెలుసు. మాకూ కోవర్ట్‌లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తాం’ అని చెప్పారు.