భద్రాద్రి కొత్తగూడెంజిల్లా : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తాము స్వాగతిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు,కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. గత రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లిలో పర్యటిస్తున్నారు. కిన్నెరసాని, మల్లన్నవాగు వరద బాధితులకు యూరియా కట్టలను పంపిణీ చేశారు.
బుధవారం (ఆగస్టు 23న) రాత్రి జగ్గయ్యగూడెంలో రేణుకాచౌదరి పల్లెనిద్ర చేశారు. గురువారం రోజు (ఆగస్టు 24న) ట్రాక్టర్ నడిపారు. పొలంలో రైతులతో కలిసి నాట్లు వేసి, వారితో ముచ్చటించారు.
కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటిదని, చాలామంది నాయకులు తమ పార్టీ నుంచే వెళ్లిన వారని చెప్పారు రేణుకాచౌదరి. సీఎం కేసీఆర్, వైఎస్ జగన్, చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఎదిగిన వారేనని అన్నారు.
మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు రేణుకాచౌదరి. ఏజెన్సీ గిరిజనులు వర్షాలు, వరదలతో పంట నష్టపోయి విలవిల్లాడిపోతున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు బాధితులను పరామర్శించడానికి సమయం కూడా లేకుండాపోయిందన్నారు.
రాష్ట్రంలో రావణ రాజ్యం, రాబందుల రాజ్యం కొనసాగుతోందన్నారు రేణుకాచౌదరి. ప్రజల సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు.