ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయాలి : రేణుకా చౌదరి

  • ఆమె స్పష్టత ఇచ్చాకే నా అభ్యర్థిత్వం గురించి ఆలోచిస్తా : రేణుకా చౌదరి

ఖమ్మం టౌన్,వెలుగు:  పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్​అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్​ లీడర్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఇక్కడి నుంచి పోటీపై సోనియా స్పష్టత ఇచ్చాకే తన అభ్యర్థిత్వం గురించి ఆలోచన చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ ఓడిపోతుందని, మంత్రి పువ్వాడ అజయ్ తూడ్చిపెట్టుకుపోతాడని తాను చెప్పిన జోస్యం నిజమైందన్నారు. బుధవారం నుంచి రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆమె చెప్పారు. రైతులు మామిడి తోటలు నరికి ఆయిల్ పామ్ తోటలు వేసుకోవడం బాధాకరమన్నారు. జామాయిల్ వేసుకోవడం ప్రమాదకరమన్నారు. మమత మెడికల్ కాలేజ్, తాను పెట్టిన భిక్ష అని ఆమె అన్నారు. కక్ష రాజకీయాలకు తమకు టైం లేదన్నారు.

ఖమ్మం రూరల్ మండలంలోని విలువైన తరుణి హాట్ ను గత పాలకులు మూలన పడేశారని విమర్శించారు. ఈ నెల 22న అయోధ్య లో జరిగే రాముడి విగ్రహ ప్రతిష్ఠను శంకరాచార్యులు వ్యతిరేకించినా.. మోదీ అహంకారంతో ముందుకు సాగడాన్ని ఖండించారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. 22 తర్వాత 10 నుంచి 15 రోజుల్లోనే పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైన స్థలాలను లీడర్లతో కలిసి సందర్శించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని రేణుకా చౌదరి చెప్పారు. మానుకొండ రాధా కిషోర్, నాగండ్ల దీపక్ చౌదరి, వడ్డేబోయిన నరసింహారావు, ముస్తఫా సమావేశంలో పాల్గొన్నారు.