ఫండ్స్​ రాలే.. పనులు కాలే

  •     గతేడాది గోదావరి వరదలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లు ఎక్కడివక్కడే..
  •     రూ. 220 కోట్ల వర్క్స్​కు ప్రపోజల్స్​.. కానీ బీఆర్ఎస్​ సర్కారు ఒక్క పైసా ఇయ్యలే..
  •     రూ.37 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో వర్క్స్​స్టార్ట్​ చేసిన కాంట్రాక్టర్లు 
  •     నెలలు గడిచినా ఫండ్స్​ విడుదల కాకపోవడంతో ఆగిన పనులు
  •     చేసిన రూ.30 కోట్ల పనులకైనా డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్ల డిమాండ్​ 
  •     ఇన్​ కంప్లీట్ వర్క్స్​తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో గతేడాది గోదావరి వరదలతో చాలా వరకు రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జి​లు దెబ్బతిన్నాయి. వాటికి బీఆర్​ఎస్​ సర్కారు ఫండ్స్​శాంక్షన్​ చేస్తానని చేయలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వరదలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జి​లతోపాటు అవసరమైన చోట లో లెవెల్​ బ్రిడ్జి​లను హై లెవెల్ బ్రిడ్జి​లుగా మార్చేందుకు ఆర్ ​అండ్ ​బీ ఆఫీసర్లు దాదాపు రూ. 220కోట్లతో అప్పటి బీఆర్ఎస్ ​సర్కారుకు ప్రపోజల్స్ ​పంపించారు.

దాంతో దాదాపు రూ.37కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. జిల్లా వ్యాప్తంగా 23వర్క్స్​కు సంబంధించి పనులను మొదలు పెట్టారు. ఇందులో ఆర్నెళ్ల కిందట దాదాపు రూ.30కోట్లకు సంబంధించి పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. కానీ వాటికి సంబంధించిన ఫండ్స్​ఇయ్యలేదు. కనీసం చేసిన పనులకైనా ఫండ్స్​ రిలీజ్​ చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్​ చేస్తున్నారు. 

ఎక్కువ పనులు టెండర్​ దశలోనే.. 

రూ.కోట్లలో వర్క్స్​ టెండర్​ దశలో ఉన్నాయి. బూర్గంపహాడ్​ టు అశ్వారావుపేట రోడ్​, బూర్గంపహడ్​ టు ఏటూరునగరం రోడ్డు, హై లెవెల్​ బ్రిడ్జ్​ నిర్మాణానికి రూ. 55కోట్లు,  చర్ల టు పూసుగుప్ప రోడ్​పై కల్వర్ట్​ల నిర్మాణాలకు రూ. 20కోట్లు, జూలూరుపాడు–చీపురుగూడెం మధ్య కల్వర్ట్​ల నిర్మాణాలకు రూ. 14 కోట్లు, పోకలగూడెం టు కర్సలబోడు తండా మధ్య కల్వర్ట్​ల నిర్మాణాలకు రూ. 15కోట్లతో పాటు మరో రూ. 30కోట్ల పనులకు టెండర్లు పిలువాల్సి ఉంది. చేసిన పనులకే డబ్బులు ఇయ్యకపోవడంతో కొత్తగా టెండర్లు పిలిచే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 

అసంపూర్తి పనులు.. ప్రజలకు అవస్థలు.. 

గుండాల టు పస్రా రోడ్, గుండాల టు దుబ్బగూడెం రోడ్​ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులతో ఇబ్బందులు పడుతున్నారు. లో లెవెల్​ వంతెనలను హై లెవెల్​ బ్రిడ్జిలుగా మార్చకపోవడంతో ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు వరదతో రాకపోకలు నిల్చిపోయే పరిస్థితి నెలకొంది. 

 ఆర్​ అండ్ ​బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులదీ అదే పరిస్థితి.. 

ఆర్ ​అండ్ ​బీ శాఖ ఆధ్వర్యంలో రూ. 100కోట్ల పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు ముట్టడంలేదు. ఉల్వనూర్–రాజాపురం రోడ్డు పనులను రూ. 15కోట్లతో పూర్తి చేసి రెండేండ్లు గడిచాయి. ఆర్ ​అండ్​బీకి ఫండ్స్​ లేకపోవడంతో తల్లాడ టు భద్రాచలం రోడ్​, దమ్మపేట టు  పాల్వంచ రోడ్​, అంకం పాలెం టు నారాయణపురం, బచ్చువారిగూడెం టు దమ్మపేట, చంద్రాలగూడెం టు కాపర్​మైన్​తో పాటు పలు రోడ్లకు పూర్తి స్థాయిలో ఫండ్స్​ రిలీజ్​కాలేదు. దీంతో చాలా వరకు రోడ్లు అసంపూర్తిగానే నిలిచిపోయాయి.