మేడిగడ్డ రిపేర్లు పూర్తి... ప్రాణహితలో మొదలైన వరద

మేడిగడ్డ రిపేర్లు పూర్తి... ప్రాణహితలో మొదలైన వరద
  •     రోజుకు 4వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌‌ఫ్లో
  •     సామాన్లు ఒడ్డుకు తెస్తున్న ఇంజినీర్లు
  •     ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు బ్యారేజీ గేట్లన్నీ ఖుల్లా

జయశంకర్‌‌ భూపాలపల్లి/ మహాదేవ్‌‌పూర్‌‌, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ దగ్గర చేపట్టిన రిపేర్‌‌ పనులు పూర్తయ్యాయి. రిపేర్ల కోసం ఉపయోగించిన సామాన్లను ఇంజినీర్లు పైకి తీసుకొస్తున్నారు. ప్రాణహితలో వరద మొదలై నాలుగు వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో నేషనల్‌‌ డ్యామ్‌‌ సేఫ్టీ ఆథారిటీ(ఎన్‌‌డీఎస్‌‌ఏ) ఆదేశాల మేరకు ఎగువ నుంచి వచ్చిన వరద.. వచ్చినట్టే కిందికి పోయేలా బ్యారేజీకి చెందిన మొత్తం 85 గేట్లను తెరిచి ఉంచారు.

బ్యారేజీకి పెరుగుతున్న వరద

వానాకాలం మొదలవడంతో ఎగువన ప్రాణహిత నది నుంచి ఇన్‌‌ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. మొన్నటిదాకా మేడిగడ్డ బ్యారేజీకి రోజుకు 2 వేల క్యూసెక్కుల వరద వస్తే ఇప్పుడు రోజుకు 4 వేల క్యూసెక్కులకు చేరింది. రిపేర్లు దాదాపు పూర్తవడం, వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఇరిగేషన్‌‌ ఇంజినీర్లు మేడిగడ్డ బ్యారేజీ దగ్గర రిపేర్లు ఆపేసి, సామాన్లు ఒడ్డుకు తీసుకొస్తున్నారు. గోదావరిలో ప్రస్తుతం వస్తున్న వరదంతా ఒకటి నుంచి 5వ బ్లాక్‌‌ల మీదుగా వెళ్లేలా కరకట్టలు కట్టారు. ఏడు, ఎనిమిదో బ్లాకులో వర్క్ జరుగుతున్నందున మట్టికట్ట పోసి వాటర్​ను డైవర్ట్ చేశారు. ఆ మట్టికట్ట ప్రస్తుతం అలాగే ఉంది. వరద పెరిగితే  మట్టికట్టలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేల బొయ్యారం పూడ్చివేత

నేషనల్‌‌ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) ఆదేశాల మేరకు భూమిలోకి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర  నెల రోజులకుపైగా చేపట్టిన రిపేర్లు పూర్తయినట్టు ఇరిగేషన్‌‌ ఇంజినీర్లు ప్రకటించారు. హైడ్రాలజీ డిపార్ట్‌‌మెంట్ ఎస్ఈ విశ్వనాథం ఆధ్వర్యంలో హైడ్రాలజీ డిపార్ట్​మెంట్ నిపుణులు శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ దగ్గర చేపట్టిన పనులు పరిశీలించారు. ముఖ్యంగా 12 మీటర్ల పొడవునా భారీగా క్రాక్‌‌లు వచ్చిన 19వ పిల్లర్​కు సిమెంట్‌‌ గ్రౌటింగ్ పనులను తనిఖీ చేశారు. క్రాక్‌‌లు బయటకు కనిపించకుండా రిపేర్‌‌ చేసే పని కొద్దిగా పెండింగ్‌ ఉన్నట్టు చెప్పారు. ఏడో బ్లాక్​లోని 19, 20, 21 పిల్లర్ల మధ్యలో ఏర్పడిన నేల బొయ్యారాన్ని సిమెంట్, కెమికల్ కాంక్రీట్​తో పూడ్చివేశారు. ఏడో బ్లాక్‌‌లో మొత్తం 210 మీటర్ల పొడవునా కొత్త షీట్‌‌ ఫైల్స్‌‌ వేశారు. బ్యారేజీ అప్‌, డౌన్‌‌ ‌స్ట్రీమ్‌‌లలో కొట్టుకుపోయిన సీసీ బ్లాక్‌‌లను సరిచేశారు. సిమెంట్‌‌, ఇసుక మిక్చర్‌‌తో కలిపి ఫిలప్‌‌ చేశారు. పిల్లర్ల ముందు కుంగిన బేస్ మెంట్‌‌పై సిమెంట్ లేయర్‌‌ వేసి సమానం చేశారు.

85 గేట్లూ ఓపెన్​

మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో కొన్ని‌ పిల్లర్లు (పియర్స్‌‌) భూమిలోకి కుంగిన తర్వాత బ్యారేజీలో వాటర్‌‌ స్టోరేజీ చేయవద్దని ఎన్‌‌డీఎస్‌‌ఏ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సారి వానాకాలంలో బ్యారేజీలో చుక్క నీరు కూడా నిల్వ చేయకుండా ఇరిగేషన్‌‌ ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 85 గేట్లు ఉండగా 5 గేట్లు మినహా అన్నీ కూడా గత నెలలోనే పైకి లేపి ఉంచారు. బ్లాక్‌‌ 7లో ఉన్న పియర్స్‌‌ భూమిలోకి కుంగడం వల్ల 21వ గేట్‌‌ తెరుచుకోకుండా తెగ ఇబ్బంది పెట్టింది. దీంతో గేట్‌‌ పూర్తిగా కట్‌‌ చేసి తొలగించారు.