సిటీలో రోడ్లపై తెరుచి ఉన్న మ్యాన్ హోళ్లకు మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. 2వేల కి.మీ పొడవైన రోడ్లపై ఉన్న 17వేల మ్యాన్ హోల్స్, 8 వేల సిల్ట్ ఛాంబర్లను యుద్ధ ప్రాతిపదికతన జలమండలి ఆధునీకరిస్తుంది. డివిజన్ల వారీగా పనులు జోరుగా సాగుతుండగా, వర్షాకాలం ఆరంభం కంటే ముందే పనులు పూర్తయ్యేలా జలమండలి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సిటీలో ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ కొన్ని ఉంటే… స్పీడ్ బ్రేకర్లుగా రోడ్డుకు ఎత్తుగా ఉండేవి మరికొన్ని. వీటితో నిత్యం నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే తెరిచిఉన్న మ్యాన్ హోల్స్ తో వాహనదారులకి అవస్థలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులన్నింటికి చెక్ పెట్టేలా, మ్యాన్ హోల్స్ ని రోడ్డుకు సమాంతరంగా నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న ఛాంబర్లను తొలగించి నూతన వాటిని ఏర్పాట్లు చేయాలని జలమండలి నిర్ణయించింది. సిటీలో దాదాపు 8వేల సిల్ట్ చాంబర్లు, స్లూయిస్ వాల్వ్ చాంబర్లు ఉన్నాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో 8వేలకుపైనే మ్యాన్ హోల్స్, క్యాచ్‌పిట్‌లు ఉండగా, వీటిని రహదారులకు సమాంతరంగా నిర్మించేందుకు దాదాపు రూ. 21 కోట్లను కేటాయించి ఆధునీకరణ పనులను వేగంగా జరుపుతోంది. ఈ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి డివిజన్ల వారీగా రోడ్లపై ఉన్న ప్రమాదకరమైన వాటిని గుర్తించి వీటి రిపేర్లపై దృష్టి పెట్టింది. జలమండలి పరిధిలోని దాదాపు అన్ని డివిజన్లలో నూతనంగా చేపట్టాల్సిన, ఆధునీకరించాల్సిన మ్యాన్ హోల్స్ వారీగా విభజించి పనులు నిర్వహిస్తుండగా, ఇప్పటికే డివిజన్ 1 గోషామహల్ పరిధిలోని పలు ప్రాంతాలలో గుర్తించిన వాటిలో దాదాపు 140 మ్యాన్ హోల్స్ నిర్మాణం, ఆధునీకరణ పూర్తి కాగా మిగతా పనులను త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించింది. అదేవిధంగా డివిజన్ 2లో 152లో 50కిపైనే చాంబర్లకు రిపేర్ చేయగా, 100 మ్యాన్ హోల్స్ ను ఆధునీకరించారు. డివిజన్ 4లో 50, డివిజన్ 5లో 142, డివిజన్ 6లో 180, డివిజన్ 7లో 230, డివిజన్ 9లో 112, డివిజన్ 10లో 138, డివిజన్ 12లో 41, డివిజన్ 13లో 18, డివిజన్ 14లో 29, డివిజన్ 15లో 48, డివిజన్ 16లో 85ఛాంబర్లు, మ్యాన్ హోల్స్ కు రిపేర్ల ప్రక్రియ పూర్తి కాగా, మిగత వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే కొన్ని డివిజన్లలో పనులు నత్తనడకన సాగుతుండటంపై ఇటీవల ఎండీ సమీక్షలో సంబంధిత అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా గడువు లోగా పనులు పూర్తి కాకుండా సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ శాఖపరమైన చర్యలు తీసుకునేలా అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది.
రోడ్డుకు సమాంతరంగా…
సిటీలో రోడ్డుకు సమాంతరంగా నిర్మిస్తున్న వీటిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఉన్నవాటిలో పాత ఛాంబర్లను తొలగించడంతోపాటు, మ్యాన్ హోల్స్ చుట్టూ శిథిలావస్థలో ప్రాంతాలను తీసివేసి, అనంతరం భారీ వర్షాలు, వరదలు లేదా మురుగు నీరు రోడ్లపై పొంగిపోర్లిన సందర్భంలో మునిగిపోయిన మూతలను సులభంగా తీసివేసేలా ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఒక పొరగా గట్టి ప్లాస్టిక్ తో చేసిన గ్రిల్ ను ఆపైన ఉక్కు మూతను బిగిస్తున్నారు. దీంతో ఒకవేళ ఉక్కు మూతను తొలగించినా, మ్యాన్ హోల్ లో పడిపోకుండా గట్టి ప్లాస్టిక్ రక్షణలా ఉండేలా వీటిని వినియోగిస్తున్నారు. దీంతో రోడ్డుకు సమాంతరంగా ఉండటంతో పాటు, ఒకవేళ పైకప్పు తొలగించిన మ్యాన్ హోల్ లో పడిపోయే అవకాశం తక్కువగా ఉంటుందనీ అధికారులు చెబుతున్నారు.