- వారంలో పూర్తి చేసేలా టార్గెట్
- మంచినీరు, టాయిలెట్స్ నిర్మాణాలకు ప్రయారిటీ..తర్వాత కరెంట్ ఇతర ఫెసిలిటీస్
- రెడీగా రూ.39.38 కోట్ల నిధులు
- నిత్యం పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రాజీవ్‌గాంధీ
నిజామాబాద్, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాల రిపేరింగ్ పనులు స్పీడ్ అయ్యాయి. ఇందు కోసం గవర్నమెంట్ విడుదల చేసిన రూ.39.38 కోట్ల ఫండ్ మొత్తం వినియోగించేలా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శ్రద్ధ చూపుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ డ్యూటీ కారణంగా పర్యవేక్షించలేకపోయారు. పనుల వేగాన్ని ఈ పది రోజుల్లో గణనీయంగా పెంచారు. స్కూల్స్‌లో బోధన గాడిన పడే సరికి క్లాస్ రూమ్స్‌లో ఎక్కడా పనులు అసంపూర్తిగా ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు.
పురోగతిలో ప్రగతి
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల స్థానంలో కాంగ్రెస్ గవర్నమెంట్ బడుల పర్యవేక్షణను మహిళా సంఘాలకు అప్పగించింది. పాలిటిక్స్ లేని సూపర్వైజింగ్ ఉండాలనే యోచనతో మహిళలకే ఆ బాధ్యత అప్పగించింది. చివరకు స్కూల్స్ రిపేర్లు, సౌకర్యాల కోసం విడుదల చేసిన రూ.39.38 కోట్ల పనులు వారికే ఇచ్చింది. పనులు పూర్తి చేశాకే బిల్స్ వచ్చే విధానం అమలులో ఉండడంతో పెట్టుబడి డబ్బులేక పనులు చేయడానికి మహిళా సంఘాలు ముందుకు రాలేదు. అయితే పనులు చేయకుండా డబ్బులు ఇస్తే దుర్వినియోగం అయ్యే చాన్స్ ఉందని భావించారు.
ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ప్రతి మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టే పనుల తాలూకు మొత్తం విలువలో 10 శాతం సొమ్మును కలెక్టర్ రాజీవ్‌గాంధీ ఎంపీడీవోల అకౌంట్లో పెట్టారు. విలేజ్ మహిళా సంఘాలను నేరుగా మానిటరింగ్ చేసే ఎంపీడీవోల వద్ద అడ్వాన్స్‌గా కొంత డబ్బు పెట్టడం కలిసొచ్చింది. దీంతో అంతటా పనులు స్పీడయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండో రోజు నుంచే కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పర్యవేక్షణ మొదలుపెట్టారు.
ఇప్పుడు కౌంటింగ్ తదితర అన్ని వ్యవహారాలు ముగిసినందున టోటల్ ఫోకస్ ఆ పనులపై కేంద్రీకరించారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యే 12వ తేదీకి అన్నీ కంప్లీట్ కావాలని టార్గెట్ విధించుకోగా 80 శాతం ముగిశాయి. మిగితా 20 శాతాన్ని వారంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఎంపిక చేసిన స్కూల్స్‌లో నీటి వసతికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. తర్వాత మరుగుదొడ్లు, మూత్రశాలల సంఖ్యను పెంచడాన్ని సెకెండ్ ప్రయారిటీగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి కూడా నిత్యం వీటిని పర్యవేక్షిస్తున్నారు.
సౌలత్ లేని స్కూళ్లు 739
జిల్లాలో ప్రైమరీ స్కూల్స్ 789, అప్పర్ ప్రైమరీ 137, హైస్కూల్స్ 269 కలిపి మొత్తం 1,195 బడులలో ఉన్నాయి. వీటిలో 1.12 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కరెంట్ సౌలత్లేని బడులు 739 ఉన్నట్లు ఇంజినీరింగ్ శాఖ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని సమకూర్చడానికి మార్చ్ నెలలో రూ.39.38 కోట్ల ఫండ్స్ తక్షణం అందించింది. ఎండాకాలం సెలవులలో పనులు కంప్లీట్ చేయాలనుకొని షురూ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలుగా కొత్త విద్యా సంవత్సరానికి రెడీ చేయాలని యోచించారు. అయితే పార్లమెంట్ ఎలక్షన్ రావడం, ఆఫీసర్లంతా వాటి హడావిడిలో ముగినిపోవడంతో బడి పనులు వెనుకబడ్డాయి.