- మన ఊరు–మన బడిలో మొదటి విడతలో 878 స్కూళ్ల ఎంపిక
- ఉమ్మడి జిల్లాలో మొత్తం స్కూళ్లు 2513
- ఎంపికైన స్కూళ్లలో 40 శాతం కూడా పూర్తికాలే
- నిలిచిపోయిన రిపేర్లు, డెవలప్మెంటు పనులు
పెద్దపల్లి, వెలుగు : రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు–మన బడి పథకం ముందుకు సాగలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 2513 స్కూళ్లు ఉండగా ఈ స్కీంలో మొదటి విడతలో 878 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిల్లో కనీసం 40 శాతం కూడా పనులు పూర్తికాలేదు. దీంతో చాలా స్కూళ్లలో రిపేర్లు, డెవలప్మెంట్పనులు నిలిచిపోయాయి. కాగా స్కీం ప్రారంభ టైంలో డెవలప్మెంట్కోసం నిధుల సమీకరణకు సహకరించాలని ప్రభుత్వం స్పాన్సర్స్ను కోరింది.
అయిననప్పటికీ అనుకున్న రెస్పాన్స్ రాలేదు. దీంతో పాటు ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాక ఈ పథకం అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. కేవలం మండలానికి 2 స్కూళ్ల చొప్పున 100 శాతం పనులు పూర్తయిన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
కష్టంగా నిధుల సేకరణ
మన ఊరు మన బడికి నిధుల సమీకరణ కష్టంగా మారింది. ప్రభుత్వం సదుద్దేశంతో పథకాన్ని ప్రకటించినా నిధులు సమకూర్చుకోవడంలో ఫెయిల్ అయింది. ఎమ్మెల్యే, ఎంపీలకు కేటాయించిన నిధుల నుంచి రూ. 2 కోట్లు మన ఊరు–మన బడికి ఇవ్వాలని సర్కార్ సూచించింది. దీనిపై నాటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐల నుంచి నిధులు సమకూర్చుకోవాలని,
ఇందుకు స్కూల్ మేనేజ్‌మెంట్లు, హెచ్ఎంలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు కూడా తెరిపించింది. అయినప్పటికీ సర్కార్ ఊహించినట్లు స్పాన్సర్లనుంచి స్పందన రాలేదు. దీంతో ఫండ్స్ లేక చాలా స్కూళ్లలో పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
పనులు చేసినా బిల్లులు రాలే..
మన ఊరు–మన బడి అభివృద్ది పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు పూర్తిగా రాలేదు. ప్రభుత్వం రూ.30 లక్షల లోపున్న పనులను మైనర్ వర్క్స్ కింద స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించింది. మైనర్ పనులను కాంట్రాక్టర్లతో పాటు పలువురు సర్పంచులు కూడా చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ రాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు ఇటీవల ఆయా స్కూళ్లకు తాళాలు వేసిన ఘటనలున్నాయి.
మేజర్పనులకు కలెక్టర్ నేతృత్వంలో వేసిన కమిటీ టెండర్లను కేటాయించింది. ఈ పనులు కూడా ఉమ్మడి జిల్లాలో చాలా స్కూళ్లలో పెండింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మన ఊరు–మన బడిపై దృష్టి సారించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డెవలప్‌మెంట్ పనులు ఎక్కడివక్కడే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 2513 సర్కార్ స్కూళ్లలో 2.30లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ఊరు– మన బడి కింద మొదటి విడతలో 878 ఎంపిక కాగా, వాటిలో కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం 647 స్కూళ్లకు 230, పెద్దపల్లిలో 549 గానూ 191, జగిత్యాలలో 783 గానూ 274, రాజన్న సిరిసిల్లలో 534 గానూ 183 స్కూల్స్ ఎంపికయ్యాయి. వీటిల్లో కనీసం 40 శాతం పనులు కూడా పూర్తికాలేదు.
పెద్దపల్లి జిల్లాలో 191 స్కూళ్లకు మండలానికి 2 చొప్పున 28 స్కూళ్లలో 100శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. జగిత్యాల, కరీంనగర్జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రాజన్న సిరిసిల్లలో మొదటి విడతలో ఎంపికైన స్కూళ్లలో 90 శాతం వరకు పూర్తయ్యాయని చెప్తున్నారు. ఈ లెక్కన మొత్తం స్కూళ్లలో ఎంపికైనవి సుమారు 30 శాతం ఉండగా.. వాటిల్లోనూ 40 శాతం మేర కూడా పనులు పూర్తికానట్లు తెలుస్తోంది.