- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నెల రోజులకే పనులు
- గతంలో కాల్వలకు మరమ్మతులు లేక ఎండిపోయిన పంటలు
- యాసంగిలోనూ దిగుబడి పెంచే ప్లాన్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఏళ్లుగా పూడుకుపోయిన ఎస్సారెస్పీ ప్రధాన కాలువలకు రిపేర్లు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ వరకు పూడుకుపోయిన కాలువలకు మరమ్మతులు ప్రారంభించగా.. ఈ సారి యాసంగిలోనూ పంట దిగుబడులు పెరిగే చాన్స్ ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పారెస్పీ నీటిని వారబందీ పద్ధతిలో చివరి ఆయకట్టు వరకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పదేళ్లుగా ఎదురు చూపులే...
పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్సీ కింది టెయిల్ఎండ్ భూములు మంథని, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో ఉన్నాయి. 2016లో పెద్దపల్లి జిల్లా మొదటి కలెక్టర్ అలుగు వర్షిణి ఎస్సారెస్సీ కాలువలను బాగు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కానీ ఆచరణలోకి రాకముందే కలెక్టర్బదిలీ అయ్యారు. ఆ సమస్య అప్పటి నుంచి అలాగే ఉంది. ఎందరో కలెక్టర్లు మారారు. రెండు సార్లు బీఆర్‌ఎస్ సర్కార్ వచ్చినా ఎస్సారెస్పీ కాలువలను పట్టించుకోలేదు.
మంథని టెయిల్ ఎండ్‌కు నీరు అందే పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. రామగిరి మండలంలో ఉన్న చాలా కెనాల్స్ ఓసీపీల కింద ధ్వంసమయ్యాయి. మంథని మండల రైతులు గోదావరి మీద పోతారం, ఆరెంద ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని డిమాండ్‌తో పోరాడుతున్నారు. అయినా ఆనాటి సర్కార్ పట్టించుకోలేదు. కాల్వ శ్రీరాంపూర్, ఓదెల రైతులు మానేరు మీద గుంటి మడుగు రిజర్వాయర్ కోసం పోరాటం చేశారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. ఎస్సారెస్సీ నీటిని సక్రమంగా రిలీజ్ చేసినట్లయితే చివరి ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్సీ కాలువల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది.
గత సర్కారు వైఫల్యం
గత సర్కార్ పాలనలో చివరి ఆయకట్టులో ఉన్న పొలాలకు యాసంగిలో సరిపడా నీళ్లందక పంటలు ఎండిపోయేవి. పెద్దపల్లి జిల్లాలో ఎస్పారెస్పీ డి83, 86 కెనాల్స్ ద్వారా నీరందించే వారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ ఎస్పారెస్పీ నీటి వాడకంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకు పోవడంతో రైతులు నష్టపోయారు. జిల్లాలో యాసంగికి ఎస్పారెస్పీ కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లు విడుదల చేస్తారు. కానీ సక్రమంగా నీటి విడుదల జరగకపోవడంతో చాలా పంట పొలాలు ఎండిపోయాయి.
బోర్లతో పాటు ఎస్సారెస్పీ నీరు...
పెద్దపల్లి జిల్లాలో రైతులు యాసంగిలో బోర్లతోపాటు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో భూగర్భజలాలు తగ్గిపోయే చాన్స్ఉండటంతో బోర్లు కూడా నీరు అందించలేకపోతాయి. పక్కనే కాళేశ్వరం ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కాళేశ్వరం నీటితో పెద్దపల్లి జిల్లాలో పంటలు పండే చాన్స్ లేదు. . అయితే ఎస్సారెస్పీ నీళ్లు ఆశించినంతగా రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్సీ చివరి ఆయకట్టులో ఉన్న కాళేశ్వరం ముంపు బాధిత రైతులు ఖరీఫ్‌లో బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్నారు. రబీలో ఎస్సారెస్సీ నుంచి నీరందక పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్సారెస్పీతో యాసంగి దిగుబడి పెంచుతాం
గత సర్కార్ ఎస్సారెస్పీ నీళ్లు అందించడంలో ఫెయిల్ అయింది. ఎస్సారెస్పీ డి83, 86 కెనాల్స్ సక్రమంగా ఉపయోగించుకుంటే అనుకున్న దిగుబడి సాధించవచ్చు. అందుకే సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోయినం, పాడైపోయిన కెనాల్స్ బాగు చేయించాలని నిర్ణయించాం. ఎస్సారెస్పీ నీళ్లు యాసంగి పంటకు ఎంతో అవసరం. రైతులకు కావాల్సిన నీళ్లు అందేలా చూస్తాం.
గోపగాని సారయ్య, మాజీ ఎంపీపీ, కాల్వ శ్రీరాంపూర్