ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో సెప్టెంబర్ లో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న ప్రకాశ్‌నగర్ బ్రిడ్జికి రిపేర్లు షురూ అయ్యాయి. ఖరాబైన వంతెనను రూ.కోటిన్నర ఖర్చుతో పునరుద్ధరించే పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఆన్ లైన్ లో నిర్వహించిన ఓపెన్ టెండర్లలో ఓ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లను దక్కించుకుంది. ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణలో తాజాగా పనులు మొదలుపెట్టారు. మున్నేరుకు సెప్టెంబర్ 1న వచ్చిన భారీ వరదలతో బ్రిడ్జిపై మొత్తం 24 స్పాన్ లకు గాను, 9 స్పాన్ లు పక్కకు జరిగాయని అప్పట్లోనే అధికారులు గుర్తించారు. బ్రిడ్జి పిల్లర్లకు ఎలాంటి నష్టం జరగకపోయినా 9 శ్లాబ్ లు భారీ వరద ప్రవాహం ఒత్తిడితో పక్కకు జరిగాయి.
బ్రిడ్జి శ్లాబ్ కు, పిల్లర్లకు మధ్య ఉండే బేరింగ్ లు కూడా కొన్ని డ్యామేజీ అయ్యాయని తేల్చారు. అప్పుడు మూడు వారాల పాటు పూర్తిగా వాహనాలను నిలిపివేశారు. మున్నేరు ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాత రూ.90 లక్షలతో బ్రిడ్జిని ఆనుకొని ఉన్న పాత కాజ్ వేను పునరుద్ధరించారు. దానిపై ప్రస్తుతానికి వాహనాల రాకపోకలు నడుస్తున్నాయి. తాజాగా రూ.1.48 కోట్లతో బ్రిడ్జి రిపేర్లు ప్రారంభించారు.