- రూ.2.3 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
కరీంనగర్ టౌన్,వెలుగు: బీటీ రోడ్ల మరమ్మతులో నాణ్యతపై కాంప్రమైజ్ కావద్దని, 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్కమాన్ చౌరస్తాలో రూ.2.3 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు మరమ్మతు పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ సిటీని అందమైన నగరంగా మార్చుకుందామని అన్నారు. బీటీ రోడ్లన్నీ తళతళా మెరవాలని, రోడ్లపై నీరు నిలువకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలతో దెబ్బతిన్న నగరంలోని అన్ని బీటీ రోడ్లను అందంగా తీర్చిదిద్దాలన్నారు. గత పాలకుల హయాంలో నగరం ఎంతో వెనకబడిపోయిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రోడ్లను నిర్మిస్తున్నామని వివరించారు. నగర ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన రోడ్లు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, కార్పొరేటర్లు మహేశ్, జయశ్రీ, శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ పుట్ట మధు, నాయకులు పాల్గొన్నారు.