వనపర్తి, వెలుగు: ఆలస్యంగా కురిసిన వర్షాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లా రైతులకు శాపంగా మారుతోంది. ఎత్తిపోతల పథకాలలో మోటార్లు మొరాయిస్తుండగా, సాగునీటి ప్రాజెక్టుల ప్రధాన కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలకు రిపేర్లు చేయకపోవడంతో రైతులు పంట సాగు కోసం తిప్పలు పడుతున్నారు. రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర సర్కారు సాగునీటి పథకాల విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. లిఫ్ట్‌లు, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఫండ్స్ కేటాయించకపోవడంతో రైతులకు ఉపయోగపడడం లేదు. మోటార్లు మొరాయిస్తుండడంతో పంపింగ్ చేయడం కష్టమని చెబుతుండగా, మరికొన్నింటి మెయింటెనెన్స్‌ను పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి. జూరాల ప్రధాన కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్రిపేర్లు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం అనుమానమే. దీంతో రైతులు తమ పొలాలకు నీరు పారించుకునేందుకు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉంది.
ఎత్తిపోయిన పథకాలు..
కృష్ణానది తీరంలోని భూములకు సాగునీటిని అందించేందుకు వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు ఫండ్స్ లేక మూతపడ్డాయి. గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేయగా, ప్రస్తుత సర్కారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలో చంద్రగడ్, అమరచింత, గుంటిపల్లి లిఫ్ట్, మదనాపురం మండలంలోని నెల్విడి ఎత్తిపోతల, సరళాసాగర్, శంకరసముద్రం, నాటెల్లి, మహిభూపాల లిఫ్ట్ లను మూలకు పడేశారు. నెల్విడి స్కీం కోసం రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది 3,600 ఎకరాలకు నీరందించాల్సి ఉండగా, ఐదేండ్లుగా చుక్క నీరు అందించడం లేదు. ఈ విషయాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని నెల్విడి, నరసింగాపురం, కొన్నూరు, ద్వారకనగరం గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో నిర్మించిన పథకాలను కావాలనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని చెల్లెపాడు లిఫ్ట్ పరిస్థితి ఇలాగే ఉండడంతో పంప్ హౌస్ లోని మోటార్లు దొంగల పాలయ్యాయి.
తీరని కష్టాలు..
87 వేల ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ఎడమ కాలువ చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందక ప్రతి ఏడాది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వీపనగండ్ల, పానగల్, చిన్నంబావి మండలాల్లోని భూములకు నీరందించే మెయిన్ కెనాల్ లైనింగ్ దెబ్బతినడం, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ రిపేర్లు చేయక నీరు ముందుకు పారడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువలకు లైనింగులు లేవు. దీంతో నీరంతా వృథా అవుతుండడంతో చివరి భూములకు సాగు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
కాలువలకు లైనింగులు లేవు..
జూరాల లెఫ్ట్, రైట్ కెనాల్స్‌తో పాటు రామన్ పాడు డ్యాం కింద కుడి, ఎడమ కాలువలు అధ్వానంగా మారాయి. రామన్ పాడ్ కింద 10 వేల ఎకరాల్లో వరి నాట్లు వేసుకుంటున్నారు. ఈ కెనాల్స్ పూర్తిగా పాడయ్యాయి. నీళ్లన్నీ లీకై పంటలు మునుగుతున్నాయని అజ్జకొల్లు, అప్పరాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లో సగం పూర్తిగా దెబ్బతిన్నాయి. గత ఏడాది కొన్నింటికి రిపేర్లు చేశారు. ఈ సారి నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయకట్టు రైతులు సాగునీటిపై ఆశలు వదులుకుంటున్నారు.