- రూ. 5.40 కోట్లతో మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం
- డబుల్ పుల్లీ సిస్టమ్‌తో కౌంటర్ వెయిట్లకు రిపేర్లు
- ఇప్పటికే పూర్తయిన 15వ గేట్, స్పిల్ వే పనులు
- మరో వారం రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు
- రాడార్ సహాయంతో ఇన్‌ఫ్లో లెక్కింపు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ రిపేర్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రాజెక్ట్‌కు కొన్నేళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో గత వర్షాకాలంలో వచ్చిన వరద తాకిడికి ప్రమాదకర స్థితికి చేరుకుంది. భారీగా వచ్చిన వరద ప్రాజెక్ట్ గేట్లపై నుంచి ప్రవహించడంతో ఓ దశలో ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందేమోనన్న అనుమానం నెలకొంది. తర్వాత నీటి ప్రవాహం తగ్గినప్పటికీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండు, 15వ గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. అలాగే పైకి ఎత్తిన 16 గేట్లు సాంకేతిక లోపం కారణంగా కిందికి దిగలేదు.
దీంతో ప్రాజెక్ట్‌లోని నీరంతా గోదావరి పాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించి రిపేర్ల కోసం రూ. 5.40 కోట్లు మంజూరు చేయించారు. ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేయించడంతో కాంట్రాక్టర్ సైతం పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 15వ గేట్ కౌంటర్ వెయిట్‌కు సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, రెండో గేట్ పనులు మరో వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
కౌంటర్ వెయిట్లకు డబుల్ పుల్లీ సిస్టమ్
కడెం ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్లను ఇప్పటివరకు సింగిల్ పుల్లీ సిస్టంతో కొనసాగిస్తున్నారు. దీని కారణంగా వరదలో కొట్టుకు వచ్చే భారీ దుంగలు అలాగే నీటి అలలు గేట్లకు నష్టం కలిగిస్తున్నాయి. వీటి కారణంగా కౌంటర్ వెయిట్లు, గేట్లు కొట్టుకుపోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఆఫీసర్లు సింగిల్ పుల్లీ సిస్టమ్‌ను పక్కన పెట్టి ప్రస్తుతం డబుల్ పుల్లీ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.
ఈ సిస్టమ్ కారణంగా వరదతో పాటు భారీ దుంగలు కొట్టుకువచ్చినా గేట్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని, వరద తాకిడి తీవ్రత కూడా ఉండదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ సిస్టంతో ఇప్పటికే 15వ గేట్‌కౌంటర్ వెయిట్ రిపేర్లు పూర్తి చేయగా, ప్రస్తుతం రెండో గేట్ పనులు జరుగుతున్నాయి. డిజైన్ మార్పు కారణంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన 18 గేట్లు సురక్షితంగా పనిచేస్తాయని ఆఫీసర్లు అంటున్నారు. వరద వచ్చిన టైంలో గేట్లను ఒకేసారి కిందకు దించకుండా డబుల్ పుల్లీ సిస్టమ్ ద్వారా గేట్ల కింద కొంత ఖాళీ ఉంచనున్నారు.
దీంతో దుంగలు, ఇతరత్రా చెత్త మొత్తం దిగువకు కొట్టుకుపోయి గేట్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. దీంతో పాటు ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతున్నందున మిగిలిన పనులను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాడార్ సహకారంతో ఇన్‌ఫ్లో లెక్కింపు
కడెం ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో లెక్కింపులో ఇప్పటివరకు గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో ఎగువ ఉన్న చిక్‌మాన్ వాగు నుంచి ప్రాజెక్ట్‌లోకి వరద భారీగా వస్తోంది. ఆఫీసర్లు ఇన్‌ఫ్లోను గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతోంది. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్లు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈ సారి నుంచి రాడార్ సహకారంతో స్కడ సిస్టమ్ ద్వారా రిజర్వాయర్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లోను కచ్చితంగా లెక్కించనున్నారు. ఈ ఇన్‌ఫ్లో లెక్కలతో ఎప్పటికప్పుడు గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్‌కు వచ్చే ఇన్‌ఫ్లోను లెక్కించేందుకు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం నుండే ఈ ఇన్‌ఫ్లో లెక్కింపు విధానం అమలు అవుతుందని ఆఫీసర్లు చెప్పారు.
వారం రోజుల్లో పనులు పూర్తి
కడెం ప్రాజెక్ట్‌కు సంబంధించి 15వ గేట్ రిపేర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండో గేట్‌కు సంబంధించిన కౌంటర్ వెయిట్ రిపేర్లు చివరి దశలో ఉన్నాయి. మొత్తం రూ. 5.40 కోట్లతో రిపేర్లు చేపట్టాం. ప్రాజెక్ట్‌లోకి వరద నీటి రాక పెరగకముందే రిపేర్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మరో వారం రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి.
- భోజదాస్, డీఈ, కడెం ప్రాజెక్ట్