- పిట్లంలో బస్టాండ్ కు రిపేర్లు
- తాత్కాలిక షెడ్డు, నీటి సౌకర్యం కల్పించని ఆర్టీసీ అధికారులు
- ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సులు పెంచక అవస్థలు
- ఎండలోనే తిప్పలు.. పట్టించుకోని ఆఫీసర్లు
పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని బస్టాండ్ కు రిపేర్లు చేపట్టిన అధికారులు ప్రయాణికుల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయడం మరిచారు. నెల రోజుల క్రితం పిట్లం బస్టాండ్ రిపేర్లు ప్రారంభించగా.. స్లాబ్ ను కూల్చి మరమ్మతులు చేస్తున్నారు. రోజూ వేల మంది వచ్చి పోయే బస్టాండ్ ప్రాంతంలో కనీసం నీడ కోసం షెడ్డు వేయలేదు.
దీంతో ప్యాసింజర్లు చెట్ల నీడలోనే ఉంటున్నారు. అసలే ఎండలు దంచికొడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు నీడ, నీటి సౌకర్యం కల్పించకపోవడంపై అధికారుల తీరు పై మండిపడుతున్నారు.
సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ విఫలం
ఆరు ప్రధాన రహదారులకు కూడలి అయిన పిట్లం మీదుగా రోజూ వేల మంది ప్రయాణం చేస్తుంటారు. దాదాపు పది డిపోలకు చెందిన బస్సులు పిట్లం మీదుగా వెళ్తాయి. ముఖ్యంగా హైదరాబాద్కు రద్దీ ఎక్కువగా ఉంటుంది. పిట్లం, బాన్సువాడ, కంగ్టి, కల్హెర్ మండలాల నుంచి హైదరాబాద్కు పిట్లం మీదుగా ఎక్కువగా వెళ్తుంటారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడంతో అధికారులు విఫలమయ్యారు. మూడు సంవత్సరాల క్రితం బస్టాండ్లో రిపేర్లు ప్రారంభించిన
కాంట్రాక్టర్ సీసీ రోడ్డు వేసి పనులను నిలిపివేశాడు. ప్రస్తుతం రిపేర్లు చేస్తున్నా ప్రయాణికుల సౌకర్యాలు పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మి ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు తగినట్లు బస్సులు వేయక పోవడంపై ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.