హైదరాబాద్, వెలుగు : రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో సదరన్ డిస్కం పరిధిలో విద్యుత్ లైన్లకు మెయింటెనెన్స్ పనులు బుధవారం మొదలయ్యాయి. టీఎస్ఎస్‌పీడీసీఎల్ పరిధిలో లైన్ల మెయింటెనెన్స్ కోసం కరెంట్ సరఫరా నిలిపివేసి పనులు చేస్తున్నారు. రోజుకో ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిపివేసి విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు నరకడం, విద్యుత్ లైన్లను సరిచేయడం, అవసరమైతే కొత్తవాటిని ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతున్నారు.
సమ్మర్‌లో పెరిగే విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేలా లైన్లను పునరుద్ధరిస్తున్నారు. ఏటా నవంబర్ నుంచి జనవరి నెలల్లో నిర్వహణ పనుల్లో భాగంగా కరెంటు సరఫరా నిలిపివేసి పనులు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లైన్ల క్లియెరెన్స్ పనులు ఆలస్యమయ్యాయి. తాజాగా ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టేందుకు సదరన్ డిస్కం ప్రణాళికలు రూపొందించింది.
సెలవు రోజుల్లో మినహాయింపు..
శని, ఆదివారాలు మినహా ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు కరెంటు సరపఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయి. ఆయా ఫీడర్ల పరిధిలో 2 గంటల పాటు నిర్వహణ పనులను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా ఆఫీడర్‌ల పరిధిలో ముందస్తుగా ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపుతున్నారు. ఆ తర్వాత లైన్లను పురుద్ధరించేందుకు కరెంటును నిలిపివేసి రిపేర్లు చేస్తున్నారు.