కడెం ప్రాజెక్టుకు రిపేర్లు

కడెం ప్రాజెక్టుకు రిపేర్లు
  •  ఐదేండ్ల తర్వాత రూ.5 కోట్లు విడుదల.. ఇటీవలే పూర్తయిన టెండర్లు
  • 10 రోజుల్లోగా ప్రారంభం కానున్న పనులు
  • డ్యామ్​ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోని బీఆర్​ఎస్​ సర్కార్​
  • ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం

నిర్మల్, వెలుగు: ఐదేండ్ల తర్వాత ఎట్టకేలకు కడెం ప్రాజెక్టు మరమ్మతులకు మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు రిపేర్లకు నాటి బీఆర్ఎస్​సర్కారు పైసా కేటాయించలేదు. మధ్యలో రెండుసార్లు డ్యామ్​ కొట్టుకపోయే  పరిస్థితి వచ్చినా స్పందించలేదు. దీంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే.. ఇరిగేషన్​ ప్రాజెక్టులపై ఫోకస్​ పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల కడెం ప్రాజెక్టు రిపేర్ల కోసం రూ.5 కోట్లు విడుదల చేయగా.. పనుల కోసం టెండర్లు పూర్తయ్యాయి. పదిరోజుల్లో పనులు ప్రారంభం కానుండగా.. జూన్​ మొదటివారంలోగా పూర్తయ్యేలా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 

దృష్టిపెట్టిన కొత్త సర్కారు

అధికారంలోకి వచ్చీ రాగానే ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్​, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి .. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి సీతక్క కొద్ది రోజుల కింద కడెం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంజనీర్ల ప్రతిపాదన మేరకు వెంటనే ప్రాజెక్టు రిపేర్ల కోసం రూ.5 కోట్లు మంజూరు చేయిస్తానని ప్రాజెక్టు వద్దే ప్రకటించారు. అన్నట్లే నిధులు మంజూరు చేయడంతో ఇటీవలే ఇరిగేష న్ ఆఫీసర్లు రిపేర్లకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తిచేశారు.

 హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్​ సంస్థ పనులను దక్కించుకుంది. మరో పది రోజుల్లో పనులు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టుకు చెందిన18 గేట్లకు, కౌంటర్ వెయిట్లకు రిపేర్లు చేపట్టనున్నారు. అవసరమైన రోలర్స్, బేరింగ్స్, ఇతర పరికరాలు మారుస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. వానకాలం సీజన్​కు ముందే  జూన్ మొదటి వారంలోగా ప్రాజెక్టు రిపేర్లన్నీ పూర్తిచేస్తామని పేర్కొంటున్నారు. 

పట్టించుకోని గత బీఆర్​ఎస్​ సర్కార్​

2018 నుంచి కడెం ప్రాజెక్టుకు రిపేర్లు లేవు. దాదాపు ఐదేండ్లపాటు అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ ఎలాంటి ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో.. ఏదో తూతూ మంత్రంగా మరమ్మతు పనులు సాగాయి. వరద వచ్చిన ప్రతిసారి గేట్లు మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలో 2022 జూలై 12న ప్రాజెక్టులోకి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్​ రావడంతో గేట్లు మొరాయించి డ్యామ్​ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఓ కౌంటర్​వెయిట్​కొట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా అప్పటి సర్కారు స్పందించకపోవడంతో 2023 జూన్​లోనూ ఇదే పరిస్థితి వచ్చింది. దాదాపు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో మరోసారి టెన్షన్​ వాతావరణం ఏర్పడింది. మరో కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీళ్లన్నీ వృథాగా పోయాయి. అదృష్ట వశాత్తు రెండుసార్లు ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని నిలబడింది.