వాషింగ్టన్: అమెరికా పౌరులను పెండ్లి చేసుకుని, సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఆ దేశంలో ఉంటున్నవారికి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకువచ్చిన ఓ ఇమిగ్రెంట్ పాలసీని ఫెడరల్ కోర్టు గురువారం రద్దుచేసింది. ఈ పాలసీ ప్రకారం.. సరైన డాక్యుమెంట్లు లేని అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, స్టెప్ చిల్డ్రన్ దేశం విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పాలసీని రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు చెప్పడంతో.. లక్షలాది మంది లీగల్ స్టేటస్ లేని మైగ్రెంట్లు ఆందోళనలో పడ్డారు.
దాదాపు 5 లక్షల మంది ఇమిగ్రెంట్లు గ్రీన్ కార్డు కోసం ఈ పాలసీ కింద అప్లై చేసుకున్న తర్వాత ఈ ఏడాది ఆగస్టులో టెక్సాస్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు(ఫెడరల్ కోర్టు వ్యవస్థలో ట్రయల్ కోర్టు) జడ్జి జె. క్యాంప్ బెల్ బార్కర్ దీనిపై స్టే విధించారు. తాజాగా పాలసీని రద్దు చేస్తూ గురువారం తీర్పు చెప్పారు. బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని జడ్జి తీర్పులో స్పష్టం చేశారు.
ట్రంప్ కట్టడి చేసినా.. వలసలు ఆగవ్
వలసల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని పదే పదే ప్రకటించిన ట్రంప్ గెలవడంతో మైగ్రెంట్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. అయితే, బైడెన్ హయాంలో చట్టబద్ధంగా విదేశాల నుంచి వలస వచ్చిన జనం.. ఇప్పుడు ఆంక్షలు విధిస్తే అక్రమంగా వలసలు వస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.