2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం పట్ల జోకులు పేలుతున్నాయి. ఎవరికి వారు పాక్ జట్టుపై, ఆ టీమ్ ఆటగాళ్లపై నోరు పారేసుకుంటున్నారు. తాజాగా, భారత మాజీ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఆ జాబితాలోకి చేరారు. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజం స్థానంలో ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సారథిగా నియమించాలని మంజ్రేకర్ చమత్కరించారు.
స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడిన మంజ్రేకర్.. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు గురించి జరిగిన చర్చలో చమత్కారమైన జోకులు పేల్చారు. మైదానంలో బాబర్ అజామ్ తీసుకున్న కొన్ని పేలవమైన నిర్ణయాలను ఎత్తిచూపుతూ, అతని నాయకత్వ లక్షణాలను ఎండగట్టారు. తక్షణమే బాబర్‌ను కెప్టెన్సీ నుండి తొలగించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీకి సూచించారు.
రాజా వారికి ఆపద్బాంధవుడు
"మీకు తెలుసా, వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా రమీజ్ రాజా వద్దకు వెళతారు. బహుశా అతను జట్టుకు CEO కావచ్చు, ఎవరికి తెలుసు? బాబర్ ఆజం స్థానంలో రమీజ్ రాజా కెప్టెన్‌గా ఉండవచ్చు. అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు.." అని మంజ్రేకర్ చమత్కరించారు. సెప్టెంబర్ 2021 నుండి డిసెంబర్ 2022 వరకు దాదాపు ఏడాది పాటు రమీజ్ రాజా PCB ఛైర్మన్‌గా పనిచేశారు. అతని కాలంలో పాకిస్తాన్ జట్టు.. 2021 టీ20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు, 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరింది.
ఇక, భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని గవాస్కర్ తెలిపారు. "ఆరు నెలల క్రితం ODI ప్రపంచ కప్‌లో బాబర్ కెప్టెన్‌గా ఉన్నాడు, ఆపై అతన్ని తొలగించారు. షాహీన్ షా ఆఫ్రిది సుమారు రెండు లేదా మూడు నెలల పాటు నాయకుడిగా ఉన్నాడు. అతని సారథ్యంలో జట్టు అప్రతిష్ట పాలయ్యింది. బాబర్ మళ్లీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.." అని అన్నారు.
అమెరికా చేతిలో ఓటమి
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం.. అమెరికా చేతిలో ఓటమి పాలవ్వడం. ఆఖరి ఓవర్‌లో అగ్రదేశం విజయానికి 14 పరుగులు కావాల్సివున్నా పాక్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. అదే మ్యాచ్‌లో సూపర్ ఓవర్ రూపంలో మరో అవకాశం వచ్చినా.. దానిని చేజార్చుకున్నారు. అనంతరం భారత్ పై స్వల్ప(120 టార్గెట్) లక్ష్యాన్ని చేధించలేకపోయారు. ఆపై పుంజుకొని కెనడాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించినా.. ఇతర జట్ల పలితాలు వారిని దెబ్బతీశాయి. జూన్ 14న అమెరికా-ఐర్లాండ్‌పై మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో పాకిస్తాన్ ముందుగానే నిష్క్రమించింది.