![9 నెలలుగా నిలిచిన ఐసీడీ ఎస్గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ](https://static.v6velugu.com/uploads/2022/09/Replacement-of-ICDS-Grade-2-Supervisor-posts-which-have-been-standing-for-9-months_zsIYdjb7hQ.jpg)
- హైకోర్టులో కేసుల పెండింగ్.. ఎదురుచూపుల్లో 433 మంది
మంచిర్యాల, వెలుగు: ఐసీడీఎస్‌లో గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకాల కోసం క్వాలిఫైడ్ అభ్యర్థులు తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జామ్‌లో మెరిట్ సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 433 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ టీచర్లతో భర్తీ చేయడానికి గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. అంగన్వాడీ టీచర్లుగా పదేండ్ల సర్వీస్ పూర్తి చేసుకుని 50 సంవత్సరాలలోపు వయసున్నవారు అర్హులు. టెన్త్ విద్యార్హత కలిగి ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జనవరి 2న ఎగ్జామ్ నిర్వహించి అదే నెల 18న ఫలితాలు విడుదల చేశారు. రిజర్వేషన్లు, మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. ఇక అపాయింట్మెంట్ఆర్డర్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న సమయంలో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో రిక్రూట్మెంట్ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో ఏడేండ్ల తర్వాత నియామకాలు జరుగుతున్నాయన్న సంతోషం క్వాలిఫైడ్ అభ్యర్థులకు లేకుండా పోయింది.
పెండింగ్‌లో ఐదు కేసులు
గ్రేడ్ 2 సూపర్వైజర్ల నియామకాలకు గతంలో డిపార్ట్‌మెంట్‌పరంగా ఎగ్జామ్ నిర్వహించేవారు. దీంతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో మొదటిసారి జేఎన్టీయూకు అప్పగించారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో కొందరు అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ టఫ్‌గా వచ్చిందని, ఎగ్జామ్ సెంటర్లో గడియారం లేకపోవడంతో టైమ్ తెలియలేదని, కొన్ని సెంటర్లలో పేపర్ లేట్‌గా ఇచ్చారని, రెండున్నర గంటల టైమ్ సరిపోలేదని పలు కారణాలను చూపుతూ హైకోర్టులో కేసులు వేశారు. కోర్టుకు వెళ్లినవారిలో మంచిర్యాల జిల్లా నుంచి నలుగురు, పెద్దపల్లి నుంచి 12మంది, జయశంకర్ భూపాలపల్లి నుంచి ముగ్గురు, వరంగల్ రూరల్ నుంచి ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒకరు ఉన్నారు. మొత్తం ఐదు కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
కేసులు తేలితేనే..
గ్రేడ్ 2 సూపర్వైజర్ల నియామకాలకు సంబంధించిన ప్రొసీజర్స్ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చిన హైకోర్టు వాదనలు ముగిసిన తర్వాతే రిక్రూట్మెంట్ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో అధికారులు మెరిట్ లిస్టును సిద్ధం చేశారు. కేసులకు సంబంధించి ఇటీవలే కౌంటర్ ఫైల్ చేసినట్టు తెలిసింది. ఈ కేసుల్లో అభ్యర్థులు చూపిన కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయని కోర్టుకు వివరించినట్టు సమాచారం. హైకోర్టులో చాలా కేసులు పెండింగ్‌లో ఉండడంతో దసరా సెలవుల్లో విచారణ జరుపుతామని సంబంధిత జడ్జి పేర్కొన్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ లీడర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి కేసులు విత్ డ్రా చేసుకునేలా అభ్యర్థులను ఒప్పించాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కేసులు త్వరగా డిస్పోజ్ అయ్యేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని క్వాలిఫైడ్ అభ్యర్థులు కోరుతున్నారు.
త్వరగా పరిష్కరించాలి
ఐసీడీఎస్‌లో ఏడేండ్ల తర్వాత గ్రేడ్ 2 సూపర్వైజర్ల నియామకాలు చేపట్టారు. అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై కొంతమంది సాధారణ కారణాలు చూపుతూ హైకోర్టులో కేసు వేయడం వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే మెరిట్ లిస్ట్ సిద్ధం అయినందున త్వరగా కేసును పరిష్కరించి అపాయింట్మెంట్స్ ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
- రాంబాబు యాదవ్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు