పాక్ లేకుండానే ఆసియా కప్ టోర్నీ..  5 జట్ల మధ్యే సమరం!

పాక్ లేకుండానే ఆసియా కప్ టోర్నీ..  5 జట్ల మధ్యే సమరం!

ఆసియా కప్ టోర్నీకి పాక్ దూరం కానుందా? భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌.. మాత్రమే ఈ టోర్నీలో తలపడనున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) తిరస్కరించినట్టు సమాచారం. అదే జరిగితే వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదు. హైబ్రిడ్ మోడల్‌ ప్రకారం.. భారత్ ఆడబోయే మ్యాచులు దుబాయ్‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి అక్కడి వాతావరణంతో ఆడటం కష్టం. అందువల్ల పీసీబీ ప్రతిపాదనకు ఏసీసీ అంగీకారం తెలపలేదని సమాచారం. 

వస్తున్న నివేదికలను బట్టి.. పాకిస్థాన్ లేకుండానే 2023 ఆసియా కప్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. పాక్ మినహా మిగిలిన అన్ని దేశాలు కాంటినెంటల్ టోర్నమెంట్ ఆడటానికి అంగీకరించినట్లు కథనాలు వస్తున్నాయి. శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనున్నట్లు తెలుస్తోంది. తరువాత జరగబోయే ఏసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాక్ మినహా సభ్య దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ పాక్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఐసీసీ వరల్డ్ కప్ 2023 నుంచి వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. అది ఒక రకంగా పాక్‌కు నష్టం కలిగించేదే అయినా.. టోర్నీ కల తప్పనుంది. భారత్ - పాక్ మ్యాచులకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ విదితమే. మరోవైపు పాక్..  ఆసియా కప్‌లో ఆడకుంటే అదే సమయంలో సౌతాఫ్రికా, జింబాబ్వేతో కలిసి ట్రై సిరీస్ నిర్వహించాలని చూస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఇరు దేశాలతో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.