అంపైర్‌ను విమర్శిస్తూ బూతులు.. హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చర్యలు

అంపైర్‌ను విమర్శిస్తూ బూతులు.. హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చర్యలు

శనివారం(జూలై 22) భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్‍లో అంపైరింగ్‍పై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంపైర్ ఔట్ ఇచ్చాడన్న ఆగ్రహంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టిన హర్మన్ ప్రీత్.. అతన్ని దూషిస్తూ పెవిలియన్ చేరింది. అనంతరం మ్యాచ్ ప్రజెంటేషన్‌లో అంపైర్లను విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నామన్న టీమిండియా కెప్టెన్.. అంపైరింగ్‍ నిర్ణయాలు తమను ఆశ్చర్యపరిచాయని తెలిపింది. భవిష్యత్తులో మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చినప్పుడు ఇలాంటి అంపైరింగ్‍కు తగ్గట్టుగా సన్నద్ధమవుతామని చెప్పుకొచ్చింది.

75 శాతం జరిమానా, 3 డీమెరిట్ పాయింట్లు

ఈ మ్యాచ్‍లో హర్మన్ ప్రీత్ ప్రవర్తనను మ్యాచ్ అఫిషియల్స్ తప్పుబట్టినట్లు సమాచారం. ఆన్ ఫీల్డ్ లో వికెట్లు పగలగొట్టినందుకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, ప్రెజెంటేషన్ సమయంలో అంపైర్ల తీరును తప్పిబట్టినందుకు గానూ మరో 25 శాతం జరిమానా విధించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది. దీంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు విధించినట్లు వెల్లడించింది.

నిషేధం

రానున్న ఇర‌వై నాలుగు నెల‌ల్లో ఆమె ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే.. నిషేధం పడనుంది. ఓ టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వ‌న్డేలు, టీ20 మ్యాచ్‌లు నిషేధం ప‌డే అవ‌కాశం ఉంది.

కాగా ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 225 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ సరిగ్గా 225 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆపై సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉన్నా.. వర్షం కారణంగా అది సాధ్యపడలేదు.