టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో జరగబోయే నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం వర్క్ లోడ్ ఎక్కువ కారణంగా ఈ స్టార్ పేసర్ కు రెస్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. బుమ్రా ఫిట్ గా ఉన్నప్పటికీ అతని మీద పని భారం తగ్గించాలని టీం యాజమాన్యం భావిస్తోందట. టెస్ట్ సిరీస్ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. రానున్న మూడు నెలలు బుమ్రా ఫిట్ గా ఉండటం టీమిండియాకు చాలా కీలకం. దీంతో రాంచీలో జరగబోయే నాలుగో టెస్ట్ కు ఈ స్టార్ పేసర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మార్చ్ 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ జరుగుతుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి మూడు టెస్టులకు బుమ్రా వైస్ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. 5 టెస్టుల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్ నాలుగో టెస్టులో ఓడిపోతే బుమ్రాను ఐదో టెస్టు కోసం జట్టులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మూడో టెస్టుకే బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని చూసినా.. రాజ్ కోట్ టెస్ట్ కు 10 రోజులు విరామం రావడంతో బుమ్రాకు ఆడించినట్లు తెలుస్తుంది.
ఈ సిరీస్ లో బుమ్రా ఆరు ఇన్నింగ్స్ ల్లో మొత్తం 80 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. తొలి టెస్టులో 25 ఓవర్లు.. రెండో టెస్టులో 34 ఓవర్లపాటు బౌలింగ్ చేసాడు. ఇక తాజాగా రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 23 ఓవర్లు బౌలింగ్ చేసాడు. వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 17 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకున్నాడు.