85 శాతం సంపద పెద్ద కులాల దగ్గరే..ఎస్టీల నుంచి నో బిలియనీర్స్​

85 శాతం సంపద పెద్ద కులాల దగ్గరే..ఎస్టీల నుంచి నో బిలియనీర్స్​
  •     ప్రపంచ అసమానతల నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశ సంపదలో 85 శాతం పెద్ద కులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉందని ‘వరల్డ్​ఇనీక్వాలిటీ ల్యాబ్​’ రిపోర్ట్​ వెల్లడించింది. భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని, బిలియనీర్ల సంపదలో దాదాపు 88 శాతం అగ్రవర్ణాల దగ్గరే ఉందని తెలిపింది. ఈ రిపోర్ట్​ ప్రకారం.. మొత్తం సంపదలో 40 శాతం అగ్రశ్రేణి కులాల నియంత్రణలో ఉంది. 

ఇది పెరుగుతున్న అసమానతలను సూచిస్తోంది.  అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) నుంచి ఒక్క బిలియనీర్​ కూడా లేడు.  2018 నాటి ఆల్- ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వే  ప్రకారం..  ‘జాతీయ సంపదలో దాదాపు 55 శాతం అగ్రవర్ణాల ఖాతాల్లో ఉంది.   భారతదేశ కుల వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన ఆర్థిక అసమానతలను ఇది తేటతెల్లం చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కులం ఆధిపత్యం కొనసాగతూనే ఉంది. కులం విద్య, ఆరోగ్య సంరక్షణ, సోషల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు,  వ్యవస్థాపకత,  సంపద సృష్టిలోనూ కులం కీలకపాత్ర పోషిస్తోంది’.  

పారిశ్రామికరంగంలో నామమాత్రమే...

అజీమ్ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ యూనివర్సిటీ "స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, 2023" నివేదిక ప్రకారం షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు)  షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీల) నుంచి పారిశ్రామికవేత్తల సంఖ్య అత్యల్పంగా ఉంది. కార్మిక శక్తిలో ఎస్సీలు 19.3 శాతం మంది ఉండగా, వీరిలో కేవలం 11.4 శాతం మంది మాత్రమే సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శ్రామిక శక్తిలో 10.1 శాతంగా ఉన్న ఎస్టీల్లో 5.4 శాతం మాత్రమే పరిశ్రమల యజమానులు.  

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 12.3 శాతం ఎస్సీలు, 5.4 శాతం ఎస్టీలు మాత్రమే అత్యధిక సంపద కలిగిన వారిలో లిస్టులో ఉన్నారు.  25 శాతానికి పైగా ఎస్సీలు,  46.3 శాతం మంది ఎస్టీలు పేదలే! ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభాలో 16.3 శాతం అత్యల్ప సంపద వర్గంలో,  19.2 శాతం అత్యధిక సంపద వర్గంలో ఉన్నారు. సంపద అసమానత 1980లలో పెరగడం ప్రారంభమైంది.  2000ల నుంచి బాగా పెరిగింది. 2014–-15,  2022–-23 మధ్య ఇలాంటి పరిస్థితే కనిపించింది.   ప్రపంచవ్యాప్తంగా అత్యంత అసమాన దేశాలలో భారతదేశం ఒకటని తేలింది.