నల్గొండ అర్బన్, సూర్యాపేట, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వదల వల్ల జరిగిన నష్టంపై త్వరగా నివేదిక ఇవ్వాలని జిల్లా నోడల్ అధికారి అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 30, 31 తేదీలతోపాటు ఈనెల 1,2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు త్వరగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
ఫొటోల ఆధారాలు, ఇతర ధ్రువపత్రాలతో సహా నష్టం అంచనాల వివరాలు సమర్పించాలన్నారు. ఆయా సెక్టార్ల వారీగా జరిగిన నష్టాన్ని అంకెలు, ఫొటోలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వివరించారు. అనంతరం సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధికారులతో ఆమె సమావేశమై వర్షానికి నష్టపోయిన వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో రవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రమణ్యంతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.