హైదరాబాద్, వెలుగు: ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నారాయణపేట జిల్లా మాగనూరు, కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి స్కూళ్లలో చోటుచేసుకున్న ఘటనలపై ఆరు వారాల్లో పూర్తి వివరాలతో రిపోర్ట్అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుల ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
మిడ్‌డే మీల్స్‌లో నాణ్యతా ప్రమాణాలు లేవని, ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ దాఖలు చేసిన పిల్‌ను డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. పిటిషనర్ తెలిపిన రెండు ఘటనలతోపాటు మరో రెండు చోట్ల కూడా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
అలాగే, విచారణకు నారాయణపేట్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో వేర్వేరుగా రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో సరైన ఆహారం పెట్టడం లేదని పిటిషనర్ తరఫు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కమిటీల నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.