- జాతీయ హరిత ట్రిబ్యునల్ కు కేఆర్ఎంబీ వినతి
న్యూఢిల్లీ: కృష్ణా నదిపై శ్రీశైలం డ్యాంకు ఎగువన సంగమేశ్వరం వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై నివేదిక సమర్పించడానికి మూడు వారాల గడువు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. కేఆర్ఎంబీ సంగమేశ్వరం సందర్శనకు రెడీ అయిన వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో తెలంగాణ వాది దేవేందర్‌రావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రాజెక్టు సందర్శన ఆగిపోయిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని ఎన్జీటీ ఆదేశించింది. కేఆర్ఎంబీ బృందంలో ఉన్న దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని కేంద్ర జలశక్తి శాఖను కోరామని కృష్ణా బోర్డు తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే బృందాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.