వన్డే వరల్డ్ కప్‌లో మరో ట్విస్ట్.. కమిటీ ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని!

వన్డే వరల్డ్ కప్‌లో మరో ట్విస్ట్.. కమిటీ ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని!

ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న 'వన్డే వరల్డ్ కప్ 2023'పై సస్పెన్స్‌లు వీడటం లేదు. దాయాది దేశం పాకిస్తాన్ రోజుకో వార్తతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొన్నటిదాకా వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. భారత్ లో పర్యటించాలా? వద్దా? అన్న దానిపై పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోనున్నారట.

ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు

పాక్‌ ప్రధాని ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీకి విదేశాంగ శాఖ మంత్రి బిలావల్‌ భుట్టో నేతృత్వం వహించనున్నారని సమాచారం. ఈ కమిటీ.. భారత్‌-పాకిస్థాన్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించనుందట. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతపై చర్చించాక తుది నివేదికను ప్రధానికి అందించనుందట. ఈ కమిటీలో పాక్‌ క్రీడల శాఖ మంత్రి అహ్‌సాన్‌ మజారీ, మరియం ఔరంగజేబు, అసద్‌ మహమూద్‌, ఖమర్‌ జమాన్‌ కైరా, మాజీ దౌత్యాధికారి తారిఖ్‌ ఫాత్మీ సభ్యులుగా ఉన్నారు.

భారత్‌లోకి పాక్ భద్రతా అధికారులు

బీసీసీఐ.. పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భద్రతను సాకుగా చూపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పాక్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ 2023లో ఆడటానికి నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) అదే అస్త్రాన్ని ఇప్పుడు వాడుతోంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా పాక్ ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

భారత్‌కు ఓ ఉన్నత స్థాయి బృందాన్ని పంపి.. పాక్‌  ఆడే వేదికల్లో భద్రత ఎలా ఉందో పరిశీలించాలని కమిటీ సభ్యులు ఇప్పటికే పీసీబీకి సూచించారట. త్వరలోనే పాక్ ఉన్నతాధికారుల బృందం ఇండియాకు రానుందని సమాచారం. వీరు పాకిస్తాన్ జట్టు మ్యాచులు ఆడబోయే నగరాలను, వేదికలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారట.

ఇక అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. దీంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వేదికలుగా పాక్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.