ఆసియాకప్-2023 వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.ఈ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీసుకొచ్చిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు తిరస్కరించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అందుకు పీసీబీ.. వన్డే వరల్డ్ కప్ రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. పాక్ పర్యటనకు అంగీకరించనని బీసీసీఐ.. ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వ్యూహాన్ని పీసీబీ.. భారత్ వైపు ఎక్కుపెడుతోంది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో పాక్ ఆడాల్సిన కొన్ని మ్యాచులు అహ్మదాబాద్ వేదికగా షెడ్యూల్ చేశారు. కానీ పాక్ అక్కడ ఆడటానికి అంగీకరించడం లేదు. టోర్నీ నుండి వైదొలగడానికి భద్రతను సాకుగా చూపుతోంది. 'ఎక్కడైనా ఆడతాం కానీ, అహ్మదాబాద్‌లో అయితే ఆడలేం..' అనే పాట పాడుతోంది. ఈ విషయమై చర్చించడానికి ఐసీసీ అధ్యక్షుడు జార్జ్ బార్క్లే ఇటీవల పాక్ లో పర్యటించగా, పీసీబీ అధ్యక్షుడు నజమ్ సేథీ ఓ వింత ప్రతిపాదనను అతని ముందు ఉంచినట్టు తెలుస్తోంది.
'భారత్ పర్యటనకు వెళ్లాలా? వద్దా? అన్నది పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ అన్నీ సజావుగా సాగినా.. అహ్మదాబాద్ వేదికపై పాక్ జట్టు మ్యాచులు ఆడబోదు. అందుకు బదులుగా చెన్నై, కోల్ కతా, బెంగళూరు వేదికలను పరిశీలించాలి. ఒకవేళ అది నాకౌట్, ఫైనల్ మ్యాచ్ అయితే తప్ప ఇతర మ్యాచులకు వేదికలను మార్చాల్సిందే..' అని పీసీబీ చీఫ్ ఐసీసీకి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ మాటలను బట్టి పాకిస్తాన్ క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ లో ఆడేది అనుమానమే అని తెలుస్తోంది. అయితే కాసులు లేక కష్టాల్లో ఉన్న పీసీబీ అలాంటి నిర్ణయం తీసుకోదనే మాటలు వినపడుతున్నాయి.